అల్లరోడి ఆ సినిమా సంగతేంటి?

ఒకప్పుడు తెలుగులో వైభవం చూసిన హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకే సమయంలో అతడి సినిమాలు అరడజను దాకా వివిధ దశల్లో ఉండేవి.

Update: 2026-06-30 18:32 GMT

ఒకప్పుడు తెలుగులో వైభవం చూసిన హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకే సమయంలో అతడి సినిమాలు అరడజను దాకా వివిధ దశల్లో ఉండేవి. తన డేట్ల కోసం ఇంకో అరడజను నిర్మాతలైనా ఎదురు చూస్తుండేవాళ్లు. నరేష్‌తో సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ అన్నట్లుండేది. తన కామెడీ సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. పెట్టుబడిని వెనక్కి తెచ్చేవి. ఇక హిట్ అయితే పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభం వచ్చేది.




రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ చిత్రాలతో అంతగా అలరిస్తూ, మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో ఒకడిగా ఉన్న నరేష్.. తర్వాత ఎలా ఫేడవుట్ అయిపోయాడో తెలిసిందే. ఒక దశ దాటాక తన కామెడీ సినిమాలు అస్సలు వర్కవుట్ కాలేదు. దీంతో రూటు మార్చి ‘నాంది’ అనే సీరియస్ మూవీ చేస్తే అది మంచి ఫలితాన్నందుకుంది. కానీ తర్వాత అదే టైపు సినిమాలు చేస్తే వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ నరేష్ పరిస్థితి మొదటికి వచ్చింది. చివరగా ‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు నరేష్.

ఐతే దీని తర్వాత నరేష్ ‘ఆల్కహాల్’ అనే వెరైటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఈ ఏడాది జనవరి 1కి ఈ సినిమా విడుదల ఖరారు చేశారు కూడా. కానీ ఆ డేటుకి రిలీజ్ చేయలేదు. కొత్త డేటూ ఇవ్వలేదు. అసలీ సినిమా గురించి ఇప్పటిదాకా ఏ అప్‌డేట్ లేదు. కానీ ఇప్పుడేమో ‘రంభ ఊర్వశి మేనక’ అనే ఫాంటసీ కామెడీ మూవీ విడుదల తేదీని ప్రకటించాడు నరేష్. ఈ చిత్రం సెప్టెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీరియస్ సినిమాల దెబ్బ తర్వాత నరేష్ మళ్లీ కామెడీ వైపు చూస్తున్నట్లుంది.

నరేష్ గతంలో ‘యముడికి మొగుడు’ అనే ఫాంటసీ కామెడీ ట్రై చేశాడు. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ ఆ జానర్లో సినిమా చేశాడు. నరేష్ సీరియస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాక అతణ్ని మళ్లీ కామెడీ సినిమాల్లో చూడ్డానికి ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్న సందేహాలున్నాయి. కానీ నరేష్‌తో ఇప్పటికే ‘బచ్చలమల్లి’ అనే సినిమాను నిర్మించిన రాజేష్ దండ రిస్కుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని చంద్రమోహన్ చింతాడ రూపొందించాడు. మరి రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి నరేష్ చేసే అల్లరి ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News