నేపోకిడ్ ఆలియా కంటే శార్వరి 8 రెట్లు తక్కువ పారితోషికం?

యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన‌ స్పై యూనివర్స్‌ మొదటి మహిళా ప్రధాన చిత్రంగా `ఆల్ఫా` ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Update: 2026-06-30 18:50 GMT

యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన‌ స్పై యూనివర్స్‌ మొదటి మహిళా ప్రధాన చిత్రంగా `ఆల్ఫా` ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా 3 జూలై 2026న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఒక యువతిని బాబీ డియోల్ పాత్ర ఒక పవర్‌ఫుల్ ఏజెంట్‌గా ఎలా తీర్చిదిద్దిందో చూపించే యాక్షన్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా విడుదల కంటే ముందే ఇందులోని నటీనటుల పారితోషికాల గురించిన చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ పోషిస్తున్న నటీనటుల పారితోషికాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది.`ఆల్ఫా` చిత్రంలో నటించినందుకు గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అత్యధికంగా రూ. 25 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు బాబీ డియోల్, అలాగే కీలక పాత్రలో నటిస్తున్న అనిల్ కపూర్ చెరో రూ. 6 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆలియా భట్‌తో సమానంగా మరో సూపర్-ఏజెంట్ పాత్ర పోషిస్తున్న శార్వరి మాత్రం కేవలం రూ. 3 కోట్ల పారితోషికం మాత్రమే అందుకున్నట్లు టాక్.

ఆలియా భట్‌తో పోలిస్తే శార్వరి పారితోషికం ఏకంగా 8 రెట్లు తక్కువ కావడం గమనార్హం. బాబీ డియోల్ కంటే కూడా సగం పారితోషికాన్నే అందుకుంది. సినిమాలో ఆలియా భట్‌తో పాటు శార్వరి కూడా సమానమైన ప్రాధాన్యత ఉన్న స్పై (గూఢచారి) పాత్రలోనే నటిస్తోంది. ఇద్దరూ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. అయినా ఒకే స్థాయి ప్రాధాన్యత ఉన్న పాత్రలను పోషిస్తున్న ఈ ఇద్దరు భామల మధ్య పారితోషికాల విషయంలో ఇంతటి భారీ వ్యత్యాసం ఉండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో వారికున్న మార్కెట్ వాల్యూ - స్టార్‌డ‌మ్. ఆలియా భట్ ఇప్పటికే బాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను, క్రేజ్‌ను సంపాదించుకుంది. కేవలం తన పేరుతోనే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగల సత్తా ఆలియాకు ఉంది. అందువల్లే త‌న‌కు రూ. 25 కోట్ల భారీ పారితోషికం దక్కింది. మరోవైపు శార్వరి టాలెంట్ ఉన్న నటి అయినా.. ఆలియాతో పోలిస్తే ఇండస్ట్రీలో ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంది. ఒక నటుడి పారితోషికం అనేది కేవలం స్క్రీన్ స్పేస్ మీదే కాకుండా... వారి కమర్షియల్ మార్కెట్ వాల్యూపై ఆధారపడి ఉంటుందనడానికి ఇదే నిదర్శనం.

ఇక ఈ చిత్రంలో హృతిక్ రోషన్ `వార్` సిరీస్‌లోని తన పాపులర్ `మేజర్ కబీర్` పాత్రలో ప్రత్యేక అతిథిగా మెరవనుండటం విశేషం. ఏదేమైనా... ఒకే రకమైన యాక్షన్ ప్యాక్డ్ స్పై పాత్రలు చేసినా.. సినీ పరిశ్రమలో సీనియారిటీ, స్టార్ క్రేజ్, బాక్సాఫీస్ స్టామినా ఆధారంగానే పారితోషికాలు ఉంటాయని ఆలియా, శార్వరిల రెమ్యునరేషన్ తేడాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ `ఆల్ఫా` గూఢచారులు వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

Tags:    

Similar News