అను ఇమ్మాన్యుయేల్ చికాగో వెళ్లిపోయిందా?
గ్లామర్, గ్రేస్‌తో కుర్రకారును అలరించిన అమ్మడు పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పుతుందని అంతా భావించారు.
'మజ్ను' సినిమాతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ ప్రారంభంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. పవన్ కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి', అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', నాగ చైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' వంటి భారీ చిత్రాల్లో నటించి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. గ్లామర్, గ్రేస్‌తో కుర్రకారును అలరించిన అమ్మడు పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పుతుందని అంతా భావించారు.
అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం అను కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కథల ఎంపికలో వైవిధ్యం ఉన్నా? జయాపజయాలు నటిగా అమ్మడి వేగానికి బ్రేకులు వేశాయి. అటుపై `మహా సముద్రం`, `అల్లుడు అదుర్స్`, `ఊర్వశివో రాక్షసివో`, `రవణాసుర` వంటి వరుస చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ కెరీర్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి.
గత ఏడాది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన `ది గర్ల్‌ఫ్రెండ్` చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ దుర్గ అనే కీలకమైన పాత్రలో కనిపించింది. సినిమాలో అమ్మడి నటనకు మంచి గుర్తింపు లభించినప్పటికీ అటుపై ఇతర ప్రాజెక్ట్‌లు పెద్దగా దక్కకపోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కథానాయికగా అవకాశాలు తగ్గిపోవడం, ఇతర భాషల్లోనూ సరైన ఆఫర్లు రాకపోవడం ఆమెను నిరాశకు గురిచేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే అవకాశాల వేటలో విసిగిపోయిన అమ్మడు భారత్‌ను వీడి చికాగోకు వెళ్లిపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అమెరికాలోనే పుట్టి పెరిగిన ఆమె సినీ కెరీర్ ఆశించిన రీతిలో సాగకపోవడంతో తిరిగి సొంత ప్రాంతానికి చేరుకున్నట్లు వినిపిస్తోంది. చికాగోలోనే కుటుంబం ఉన్నందున కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పరిశ్రమలో విజయాపజయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు టాప్ లీగ్ హీరోల పక్కన మెరిసిన కథానాయికలు సైతం సరైన హిట్లు లేక తప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అను ఇమ్మాన్యుయేల్ కూడా ఇదే దారిలో చికాగోకు పరిమితమైందా? లేక సరైన స్క్రిప్ట్ దొరికితే మళ్లీ రీ-ఎంట్రీతో కెమెరా ముందుకు వస్తుందా? అన్నది వేచి చూడాలి. అయితే నేటి తరం నటీమణులు గ్యాప్ తీసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం అంత సులభం కాదు. పెరిగిన పోటీలో మేకర్స్ సీనియర్ నటీమణులకు ఇచ్చిన ప్రాధాన్యత నవతరం నటులకు ఇవ్డం లేదన్నది తెలిసిందే.