'కూలీ' పవర్‌హౌస్ బీట్.. అనిరుధ్ కాపీ చేసాడా?
అయితే ఈ రెండు ట్రాక్ లను పరిశీలిస్తే... ఇది వందశాతం కాపీ ట్యూన్ లా అనిపించదు. అయితే రెండు పాటల విజువలైజేషన్ జైలు నేపథ్యంలో కనిపిస్తోంది;
చాలా హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో భారతదేశంలో సినిమాలు తెరకెక్కాయి. హాలీవుడ్ లో ఉపయోగించిన సాంకేతికతను ఇప్పుడు భారతీయ సినిమాలు అందిపుచ్చుకుని సంచలనాలు నమోదు చేస్తున్నాయి. అయితే హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందడం వేరు.. యథాతథంగా కాపీ చేయడం వేరు. అయితే సాంకేతికతను అరువు తెచ్చుకోవడం వరకూ ఓకే కానీ, కొన్నిసార్లు క్రియేటివిటీని కాపీ చేసినప్పుడు తీవ్ర సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సీన్లు, లేదా కథ, సంగీతం, రచనలు ఇలా కాపీ చేస్తే వాటికి ఆర్థికంగా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాపీ రైట్ చట్టాలు ఇప్పుడు బలంగా రూపుదిద్దుకోవడంతో కాపీ చేయాలంటే మన మేకర్స్ ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `కూలీ` చిత్రంలోని పవర్ హౌస్ పాట ఫలానా హాలీవుడ్ ట్రాక్ కి కాపీ అంటూ సోషల్ మీడియాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. `పవర్ హౌస్` అమెరికన్ రాపర్ లిల్ నాస్ ఎక్స్ 2021 హిట్ `ఇండస్ట్రీ బేబీ`తో పోల్చి చూస్తున్నారు. బాణీని కాపీ చేయడమే గాక, ర్యాప్ నిర్మాణం ఇంచుమించు ఒకేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు.
అయితే ఈ రెండు ట్రాక్ లను పరిశీలిస్తే... ఇది వందశాతం కాపీ ట్యూన్ లా అనిపించదు. అయితే రెండు పాటల విజువలైజేషన్ జైలు నేపథ్యంలో కనిపిస్తోంది కాబట్టి, ట్రాక్ ల మధ్య సారూప్యతలు చూడటం సహజం. అనిరుథ్ ఒకవేళ లిలి నాస్ ఎక్స్ ఇండస్ట్రీ బేబీ నుంచి స్ఫూర్తి పొందినా కానీ, ఇక్కడ కథకు తగ్గట్టు లోకలైజ్ చేయడం ఆకట్టుకుంది. ఇలాంటి వాటిని వందశాతం కాపీ చేసే దమ్ము అనిరుధ్ లాంటి ప్రముఖుడికి లేదు. నిర్మాత లేదా దర్శకుడి రిఫరెన్స్ ప్రభావం అతడి క్రియేటివిటీపై పడి ఉండొచ్చు. అయినా పాశ్చాత్య బాణీలను ఇప్పుడు కాపీ కొట్టాల్సిన పని లేదు. ఒరిజినల్ క్రియేటివిటీతో సంగీత దర్శకులంతా తామేంటో చూపించాల్సి ఉంది.
ఇకపోతే లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన `కూలీ` ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం అనిరుధ్ పై ఆరోపణలపై చిత్రబృందం స్పందించలేదు. ఇక రజనీకాంత్ కి బంధువే అయిన అనిరుధ్ వరుసగా సూపర్ స్టార్ సినిమాలకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అతడు వందశాతం ఎఫర్ట్ పెట్టి కూలీ కోసం పని చేసాడని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.