IMAX కెమెరాలతో చిత్రీకరించిన మొదటి చిత్రం ఇదే!
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సాంకేతికతను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే దర్శకుల్లో క్రిస్టోఫర్ నోలన్ పేరు మొదటి వరుసలో ఉంటుంది.
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సాంకేతికతను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే దర్శకుల్లో క్రిస్టోఫర్ నోలన్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఆయన సినిమా తీస్తున్నారంటేనే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్లో ఒకే రకమైన ఉత్కంఠ మొదలవుతుంది. తాజాగా నోలన్ తెరకెక్కించిన `ది ఒడిస్సీ` చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగాసంచలన చర్చకు తెర తీసింది. సినిమా చరిత్రలోనే మొదటిసారిగా ఈ చిత్రాన్ని పూర్తిగా ఐమాక్స్ (IMAX) కెమెరాలతో మాత్రమే చిత్రీకరిస్తుండటం.
క్రిస్టోఫర్ నోలన్‌కు ఐమాక్స్ ఫార్మాట్ అంటే ఎంత ఇష్టమో ఆయన గత చిత్రాలు`‘ది డార్క్ నైట్`, `ఇంటర్‌స్టెల్లార్`, `డంకిర్క్` వంటి సినిమాలు నిరూపించాయి. అయితే ఆయా సినిమాల్లో కేవలం కొన్ని ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్సులు .. లార్జ్-స్కేల్ విజువల్స్ కోసం మాత్రమే ఐమాక్స్ కెమెరాలను ఉపయోగించారు. మిగిలిన భాగాన్ని సాధారణ 35ఎమ్ఎమ్ .. 70ఎమ్ఎమ్ కెమెరాలతో షూట్ చూసారు. కానీ `ది ఒడిస్సీ` చిత్రంతో నోలన్ ఆ పరిమితులను బద్దలు కొడుతూ మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు వంద శాతం ఐమాక్స్ కెమెరాలనే వినియోగించడం విశేషం.
భారతదేశంలో ప్రత్యేకించి టాలీవుడ్‌లో ఈ చిత్రంపై ఇంతటి భారీ చర్చ జరగడానికి తెలుగు ప్రేక్షకుల విజువల్ టేస్ట్ ఓ కారణం. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` వంటి చిత్రాల తర్వాత తెలుగు ప్రేక్షకులు లార్జర్-ద్యాన్-లైఫ్ సినిమాలను, అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకుంటున్నారు. నోలన్ గత చిత్రం `ఓపెన్‌హైమర్` తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించడమే కాకుండా.. ఐమాక్స్ స్క్రీన్ల వద్ద జాతరను తలపించింది. దీంతో నోలన్ నుండి రాబోతున్న సరికొత్త విజువల్ వండర్ కోసం ఇక్కడి ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
పూర్తి స్థాయి ఐమాక్స్ చిత్రాన్ని నిర్మించడం అనేది అంత సులువైన విషయం కాదు. ఐమాక్స్ కెమెరాలు చాలా బరువుగా ఉంటాయి. షూటింగ్ సమయంలో భారీ శబ్దాన్ని చేస్తాయి. దీనివల్ల నటీనటుల సంభాషణలను రికార్డ్ చేయడం కష్టతరమైన ప్రక్రియ. అంతేకాదు ఈ కెమెరాల ఫిల్మ్ రోల్స్ ఖర్చు కూడా అత్యధికం. ఇన్ని సాంకేతిక సవాళ్లు, భారీ వ్యయం ఉన్నప్పటికీ,ప్రేక్షకులకు థియేటర్లలో నెవర్-బిఫోర్ విజువల్స్ అందించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో నోలన్ ఈ సాహసానికి పూనుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన `ఓపెన్‌హైమర్` తర్వాత నోలన్ నుండి వస్తున్న సినిమా కావడంతో `ది ఒడిస్సీ`పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. `ఓపెన్‌హైమర్లో` అటామిక్ బాంబ్ పేలుడు సీన్‌ను సిజిఐ లేకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌తో చూపించి నోలన్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు `ది ఒడిస్సీ`లో ఎలాంటి విజువల్ అద్భుతాలను చూపించబోతున్నారో? ఐమాక్స్ కెమెరాల పూర్తి సామర్థ్యాన్ని స్క్రీన్‌పై ఎలా ఆవిష్కరించబోతున్నారో ?అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.
ఓటీటీల తాకిడి ఎక్కువైన ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం కథ మాత్రమే సరిపోదు. ఖచ్చితంగా థియేటర్లలోనే చూడాల్సిన విజువల్ ఎక్స్‌పీరియన్స్ కావాలని నోలన్ బలంగా నమ్ముతారు. `ది ఒడిస్సీ` సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌కు సరికొత్త నిర్వచనం ఇవ్వబోతోందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం కనుక భారీ విజయం సాధిస్తే భవిష్యత్తులో హాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమా రంగంలో కూడా మరిన్ని చిత్రాలు పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందేందుకు అవకాశం ఉంది.