దిగ్గజాల వల్ల కాలేదు.. రావిపూడితో అవుతుందా?

సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఆ ఆలోచన టాలీవుడ్‌ లో కొత్తదేమీ కాదు.

Update: 2026-09-27 00:30 GMT

సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఆ ఆలోచన టాలీవుడ్‌ లో కొత్తదేమీ కాదు. కొన్నేళ్లుగా ఆ ఇద్దరు స్టార్ హీరోల కాంబోపై చర్చ జరుగుతూనే ఉంది. గతంలో ఏకంగా ఇద్దరు సీనియర్ డైరెక్టర్లు ట్రై చేసినా ఆ కాంబినేషన్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు కొంతకాలంగా జరుగుతున్న మల్టీస్టారర్ ప్రచారానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు యాడ్ కావడంతో మరోసారి ఇంట్రెస్ట్ మొదలైంది.

నిజానికి చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కొన్నేళ్లుగా టాలీవుడ్‌ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. పర్సనల్ గా కూడా మంచి ఫ్రెండ్స్. ఒకరి సినిమాలను మరొకరు అభినందించుకోవడం, ఫ్యామిలీ ఈవెంట్స్ లో కలుసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ స్క్రీన్ పై మాత్రం ఇద్దరూ కలిసి కనిపించలేదు. ఆ కోరిక ఎప్పటికైనా తీరుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

అయితే ఆ కాంబో కోసం మొదటి ప్రయత్నం దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ టైమ్ లో జరిగింది. చిరంజీవితో అల్లుడా మజాకా, నాగార్జునతో హలో బ్రదర్ వంటి సినిమాలు చేసిన ఈవీవీ.. ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన చేశారు. అప్పట్లో ఆ ప్రాజెక్టుపై చర్చలు జరిగినా సినిమా మాత్రం ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత మరోసారి ఆ కాంబినేషన్‌ కు ట్రై చేశారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.

ఈసారి విషయం కాస్త ముందుకెళ్లింది. స్టోరీ రెడీ అయింది. చిరంజీవి, నాగార్జున ఇద్దరూ నటించేందుకు ఓకే చెప్పారు. షూటింగ్ మొదలై కొన్ని కీలక సీన్స్ ను షూట్ చేసినట్లు సమాచారం. అయితే కథ చిరు రోల్ కు పూర్తిగా సరిపోదనే అభిప్రాయంతో రాఘవేంద్రరావే ఆ ప్రాజెక్టును ఆపేశారు. దీంతో మరోసారి చిరు- నాగ్ మల్టీస్టారర్ కలగానే మిగిలింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అదే కాంబోపై మళ్లీ ప్రచారం జరుగుతోంది.

కొంతకాలంగా చిరంజీవి, నాగార్జునతో రావిపూడి మల్టీస్టారర్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నాయి. అయితే రావిపూడికి సీనియర్ హీరోలతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వెంకటేష్‌ తో ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు చేశారు. బాలకృష్ణతో భగవంత్ కేసరి మూవీ తెరకెక్కించారు. ఇటీవల చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు మూవీ చేశారు.

అందుకే నాగార్జునతో సినిమా చేయాలనే కోరిక తనకు ఉందని అనిల్ గతంలోనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నాగార్జునతో అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్టులో చిరంజీవిని కూడా భాగం చేయాలనే ఆలోచన ఆయనకు ఉందట. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఆ మల్టీస్టారర్ తెరకెక్కుతుందని, 2028 సంక్రాంతి రిలీజ్ ను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

అయితే ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి ఇది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. కానీ గతంలో ఈవీవీ, రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకులు ప్రయత్నించి పూర్తి చేయలేకపోయిన చిరు- నాగ్ కాంబినేషన్.. ఇప్పుడు అనిల్ రావిపూడి చేతుల్లోకి వస్తుందనే వార్త మాత్రం అభిమానుల్లో ఇంట్రెస్ట్ పెంచుతోంది. నిజంగా ఈసారి ఆ కాంబో పాజిబుల్ అవుతుందా అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News