విశ్వంభర టీమ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఒకేసారి రెండు బిగ్ అనౌన్స్‌మెంట్స్?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభరపై ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.;
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభరపై ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. గతేడాది ఆగస్టులో చివరిసారిగా అప్‌డేట్ వచ్చిన తర్వాత, ఈ సినిమా గురించి ఎలాంటి ముఖ్యమైన సమాచారం బయటకు రాకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆ నిశ్శబ్దానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని టాలీవుడ్ వర్గాలు సూచిస్తున్నాయి.
టెక్నికల్ వర్క్స్ వల్ల ఆలస్యం
వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ మొదటి నుంచి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే ముందుకు సాగుతోంది. కానీ వీఎఫ్ఎక్స్ పనుల్లో జరిగిన ఆలస్యాల కారణంగా సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సాంకేతిక పనులు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. దీంతో చిత్ర యూనిట్ మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ట్రైలర్ కట్ వర్క్స్ లో బిజీగా మేకర్స్
ఇప్పటికే ట్రైలర్ కట్ వర్క్స్ ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ట్రైలర్‌ను పవర్‌ఫుల్‌గా మలచి, దాంతో పాటూ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు త్వరలోనే డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ అయినట్టే అనుకోవాలి. మొదటగా శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్ర అప్‌డేట్ ఇవ్వాలని భావించినప్పటికీ, ఆ సమయంలో ఇతర సినిమాల హడావిడి ఉండటంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. ఇప్పుడు సరైన టైమింగ్ చూసుకుని, ట్రైలర్ రిలీజ్‌తో భారీ అనౌన్స్‌మెంట్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. యువీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాల పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, విశ్వంభర ట్రైలర్ కీలక పాత్ర పోషించనుంది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు కావడం ఖాయం. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు ఈ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎప్పుడు రిలీజవుతుంది? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది. మొత్తానికి విశ్వంభర టీమ్ భారీ కంబ్యాక్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.