విశ్వంభర కొత్త ట్విస్ట్.. రిస్క్ అవుతుందా? కలిసొస్తుందా?

ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా.. పదేపదే వాయిదా పడుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

Update: 2026-06-30 12:15 GMT

ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా.. పదేపదే వాయిదా పడుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. అయితే ఇప్పుడు అదే చిత్రానికి సంబంధించి వస్తున్న తాజా సమాచారం మెగా ఫ్యాన్స్‌ లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందు మరోసారి షూటింగ్ నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారింది. ఆ కొత్త ఎపిసోడ్ సినిమాకు మరింత బలం చేకూరుస్తుందా? లేక విడుదల మరింత ఆలస్యమయ్యేలా చేస్తుందా? అన్న చర్చ మొదలైంది.

దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభరపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఆ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌ కు ప్రాధాన్యం ఉన్న ఆ సినిమా కోసం చాలా కాలంగా గ్రాఫిక్స్ పనులు కొనసాగాయి. తాజా సమాచారం ప్రకారం వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయ్యాయని, ఫైనల్ అవుట్‌ పుట్‌ ను చిరంజీవి స్వయంగా చూసినట్లు తెలుస్తోంది. సంతృప్తి కూడా వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. సినిమాలో కథకు మరింత బలం చేకూరేలా ఒక కొత్త ఎపిసోడ్‌ ను యాడ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. దీనికోసం మరో చిన్న షెడ్యూల్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న చిరంజీవి, ఆ షెడ్యూల్‌ కు ఇబ్బంది లేకుండా విశ్వంభర కోసం కూడా కొన్ని రోజులు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.

కొత్త సన్నివేశం యాడ్ చేయడం వల్ల సినిమా మరింత ఆకట్టుకునే అవకాశముందని కొందరు భావిస్తుండగా, ఇప్పటికే ఆలస్యమైన చిత్రానికి ఇది మరో రిస్క్ అవుతుందా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. సృష్టి, స్థితి, లయ అనే అంశాల చుట్టూ కథ సాగుతుందని, విశ్వ రహస్యాలను ఫాంటసీ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి దర్శకుడు కథను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. బింబిసారతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వశిష్ట, ఈసారి చిరంజీవిని సరికొత్త అవతారంలో చూపించబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఆ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. కీరవాణి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కొత్తగా షూట్ చేయనున్న ఎపిసోడ్‌ తో పాటు మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దసరా సీజన్‌ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త ఎపిసోడ్ షూటింగ్ నిర్ణయం సినిమాకు ప్లస్ అవుతుందా? లేక విడుదలపై మరోసారి ప్రభావం చూపుతుందా? అన్నది చూడాలి.

Tags:    

Similar News