హిట్ కోసం కొత్త ప్లాన్… మల్టీ స్టారర్ మూవీకి రెడీ అవుతున్న రవితేజ!
టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణుతో కలిసి రవితేజ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ టాలీవుడ్‌లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తోందంటే థియేటర్లలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఫుల్ గ్యారెంటీ. అయితే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రవితేజ, ఈసారి ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణుతో కలిసి రవితేజ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ టాలీవుడ్‌లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హిట్ కోసం రవితేజ గట్టి ప్రయత్నాలు:
'వాల్తేరు వీరయ్య' సినిమా తర్వాత రవితేజ చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు వస్తున్నా, ఫ్యాన్స్‌కు పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
శ్రీవిష్ణు డైరెక్టర్‌తో మాస్ మహారాజా చేతులు కలపడం:
ఈ తరుణంలోనే రవితేజ తన తదుపరి సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల స్పెషలిస్ట్ హసిత్ గోలి దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నారు. యంగ్ హీరో శ్రీవిష్ణుతో 'రాజ రాజ చోర', 'స్వాగ్' వంటి విభిన్నమైన సినిమాలు తీసి హసిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే డైరెక్టర్ చెప్పిన ఒక హిలేరియస్ ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్ రవితేజకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అని సమాచారం.
శ్రీవిష్ణు కూడా ఉన్నాడు.. దిల్ రాజు నిర్మాణంలో:
ఈ సినిమాలో రవితేజతో పాటు శ్రీవిష్ణు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుండడం విశేషం. ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ కలిసి 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ టాక్.
సంక్రాంతి 2027 రేసులో మాస్ ఎంటర్‌టైనర్:
ఈ క్రేజీ మూవీని రాబోయే 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక సంక్రాంతి సీజన్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు అడ్డా. కాబట్టి రవితేజ, శ్రీవిష్ణు కాంబోలో వచ్చే ఈ సినిమా పండగ విన్నర్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు టాక్.
వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజకు ఈ మల్టీస్టారర్ సినిమా చాలా ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. హసిత్ గోలి మార్క్ కామెడీ, రవితేజ మాస్ ఎనర్జీ, శ్రీవిష్ణు టైమింగ్ అన్నీ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మరి ఈ కొత్త కాంబినేషన్ మాస్ మహారాజాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి..