క్లాసిక్ సినిమా లెగసీని కాపాడుతున్న సూప‌ర్ స్టార్!

ఒకప్పుడు సీక్వెల్ అంటే ఇప్పటికే హిట్ అయిన కథను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.

Update: 2026-06-30 08:30 GMT

ఒకప్పుడు సీక్వెల్ అంటే ఇప్పటికే హిట్ అయిన కథను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ముఖ్యంగా కోలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ రూపొందించడం ఓ ట్రెండ్ గా మారింది. ప్రేక్షకుల్లో ఉన్న నాస్టాల్జియాను, బ్రాండ్ వాల్యూను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో పలువురు డైరెక్ట‌ర్లు, నిర్మాతలు సీక్వెల్స్‌పై దృష్టి పెడుతున్నారు. అయితే ఈ ట్రెండ్ మధ్య కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఒక క్లాసిక్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమా ఇప్పటికీ తమిళ సినీ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన కమర్షియల్ క్లాసిక్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. హీరో క్యారెక్టరైజేషన్, ఎమోష‌న్స్, కుటుంబ కథనం, మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్, మ్యూజిక్, విల‌న్ క్యారెక్ట‌ర్.. ఇలా ప్రతి అంశం ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడటం సహజం.

ఇటీవల డైరెక్ట‌ర్ కె.ఎస్. రవికుమార్‌తో కలిసి ఈ సినిమాకు సీక్వెల్ పై డిస్క‌ష‌న్స్ జరిపినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కథ ఆలోచన ప్రారంభ దశలో ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, పూర్తి స్థాయి స్క్రిప్ట్ మాత్రం ఆ క్లాసిక్‌కు తగ్గ స్థాయిలో లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లకుండా వేచి చూడాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఇదే నిర్ణయం రజనీకాంత్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఉందనే కారణంతో దానికి సీక్వెల్ రూపొందించడం కంటే, ప్రేక్షకులు ఆశించే స్థాయిలో బలమైన కథ దొరికినప్పుడే ముందుకు వెళ్లాలనే దృక్పథాన్ని ఆయన అనుసరిస్తున్నట్లు డిస్క‌ష‌న్ జరుగుతోంది.

గత కొన్నేళ్లుగా తమిళంలో అనేక సీక్వెల్స్ తెరకెక్కుతున్నప్పటికీ, వాటిలో అన్నీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ముఖ్యంగా క్లాసిక్ సినిమాల‌కు సీక్వెల్స్ తీసుకురావడం ఎంత పెద్ద సవాలో ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు మరోసారి గుర్తు చేశాయి. మొదటి భాగం సృష్టించిన ఎమోష‌న్ ను, ఇంపాక్ట్ ను మళ్లీ తెరపై ఆవిష్కరించడం అంత సులభం కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పడయప్పలాంటి సినిమా విషయంలో రజనీకాంత్ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడం అభిమానుల్లో కూడా సానుకూల స్పందనకు కారణమవుతోంది. ఒక క్లాసిక్ సినిమాని కేవలం సీక్వెల్ ట్రెండ్ కోసం ఉపయోగించకుండా, దాని గౌరవాన్ని కాపాడాలనే రజినీ ఆలోచన ప్రశంసలు అందుకుంటోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా, ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కథ స్ట్రాంగ్ గా లేనంత కాలం ఆ క్లాసిక్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఆలోచ‌న రజనీకాంత్‌కు అస్స‌లు లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఫ్యూచ‌ర్ లో నిజంగా పడయప్ప స్థాయికి తగ్గ కథ దొరికితే పరిస్థితి మారే అవకాశం కూడా లేకపోలేదు. అప్పటి వరకు మాత్రం ఈ క్లాసిక్ తన ప్రత్యేక స్థానాన్ని అలాగే నిలబెట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News