అనిరుధ్ కోసం కోట్ల పెట్టుబ‌డి.. నిర్మాత‌ల మాస్ట‌ర్ ప్లాన్

ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలంటే స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్, విజువల్ గ్రాండియర్ మాత్రమే మెయిన్ ఎట్రాక్ష‌న్స్ గా భావించేవారు.

Update: 2026-06-30 07:19 GMT

ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలంటే స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్, విజువల్ గ్రాండియర్ మాత్రమే మెయిన్ ఎట్రాక్ష‌న్స్ గా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భారీ సినిమాల‌ను ప్లాన్ చేస్తున్న నిర్మాతలు హీరో, డైరెక్ట‌ర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ష‌న్ కు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ లిస్ట్ లో మొదటి పేరు అనిరుధ్ రవిచందర్‌దే. ఆయన లేకుండా పాన్ ఇండియా సినిమాను ఊహించడం కూడా కష్టమేననే అభిప్రాయం ఇప్పుడు ఇండస్ట్రీలో బలపడుతోంది.

దానికి ప్రధాన కారణం అనిరుధ్ మ్యూజిక్ ఇప్పుడు కేవలం ఆల్బమ్‌కే పరిమితం కాకపోవడమే. ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజ్ కు ముందే సినిమాపై భారీ అంచనాలు పెంచుతుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు నెక్ట్స్ లెవెల్ ఇంపాక్ట్ ను తీసుకొస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీన్స్, హీరో ఎలివేషన్లు.. ఇలా ప్రతి కీలక ఘట్టాన్ని ఆడియ‌న్స్ కు మరింత బలంగా చేరవేయడంలో అనిరుధ్ బీజీఎం ప్రధాన బలంగా మారింది. అందుకే ఇప్పుడు చాలా మంది డైరెక్ట‌ర్లు స్క్రిప్ట్ సిద్ధమైన దశలోనే అనిరుధ్‌ను లాక్ చేసుకోవాలని భావిస్తున్నారు.

నిర్మాతల ఆలోచన కూడా పూర్తిగా బిజినెస్ యాంగిల్ లోనే సాగుతోంది. అనిరుధ్ పేరు పోస్టర్‌పై కనిపించగానే మ్యూజిక్ కంపెనీలు ఆడియో హక్కుల కోసం భారీ మొత్తాలు ఆఫర్ చేస్తుండ‌టంతో నిర్మాత‌లు అనిరుధ్ కోసం క్యూ క‌డుతున్నారు. అనిరుధ్ తో ప‌ని చేయ‌డం వ‌ల్ల ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ కాక‌ముందే సోషల్ మీడియాలో భారీ బజ్ రావడం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల వ్యూస్ నమోదు కావడం, ఆడియో రైట్స్ ద్వారా పెట్టుబడిలో కొంత భాగం ముందుగానే రికవరీ కావడం వంటి అంశాలు నిర్మాతలకు పెద్ద ప్లస్‌గా మారుతున్నాయి. అందుకే ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాత‌లు వెనుకాడటం లేదు.

అనిరుధ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సౌత్ సినీ ఇండ‌స్ట్రీలోని ప‌లువురు యంగ్ హీరోల రెమ్యూన‌రేష‌న్ కంటే కూడా ఇది చాలా ఎక్కువ‌. అయితే అనిరుధ్ కు ఇచ్చే భారీ రెమ్యూన‌రేష‌న్ ను నిర్మాత‌లు ఖ‌ర్చుగా కాకుండా, దాన్నొక పెట్టుబడిగా భావిస్తున్నార‌నే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వై దిస్ కొలవెరి డి పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్, తక్కువ కాలంలోనే భారతీయ సినీ సంగీత రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న కంపోజర్‌గా ఎదిగారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోని భారీ ప్రాజెక్టులు వరుసగా ఆయన చేతిలో ఉండటం, ప్రముఖ హీరోలు, డైరెక్ట‌ర్లు, నిర్మాణ సంస్థలు తొలి ఎంపికగా ఆయననే సంప్రదించడం ఆయన మార్కెట్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా కు హైప్ తీసుకురావడానికి మ్యూజిక్ ఉప‌యోగ‌ప‌డేది. ఇప్పుడు అనిరుధ్ మ్యూజికే సినిమాకు ముందస్తు బ్రాండ్ వాల్యూను తీసుకొచ్చే స్థాయికి చేరిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News