అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక'.. మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చారా?
కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్ మరోసారి కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్ మరోసారి కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గత కొన్నేళ్లుగా నాంది, ఉగ్రం, బచ్చలమల్లి వంటి విభిన్న కథలతో నటుడిగా తనలోని మరో యాంగిల్ ను చూపించిన ఆయన.. ఇప్పుడు తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన కామెడీ జానర్ లోకి తిరిగి అడుగుపెట్టారు. ఆయన నెక్స్ట్ మూవీకి రంభ ఊర్వశి మేనక అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను మూవీ టీమ్ విడుదల చేసింది.
చంద్ర మోహన్ చింతడ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రాన్ని రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఆ సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. సినిమాకు కామెడీ గోస్ కాస్మిక్ అనే ట్యాగ్ లైన్ ను పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అప్సరసలైన రంభ, ఊర్వశి, మేనక పేర్లను టైటిల్ లో యూజ్ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లరి నరేష్ స్వర్గపు మెట్లపై కూర్చుని చేతిలో పెన్నుతో ఏదో రాస్తూ కనిపించారు. ఆ స్క్రోల్ పై రంభ, ఊర్వశి, మేనక పేర్లు ఉండగా.. వెనుక మేఘాల మధ్య అప్సరసల బొమ్మలు చూపించారు. అయితే ఆ పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. హీరో చుట్టూ సృష్టించిన ఆ మిస్టరీ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
అయితే అల్లరి నరేష్ కెరీర్ లో కామెడీ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. అల్లరి, సీమ శాస్త్రి, సుడిగాడు, బ్లేడ్ బాబ్జీ వంటి చిత్రాలతో ఆయన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తర్వాత వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్లీ కామెడీ వైపు రావడంతో అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ను ఆయన కామెడీ టైమింగ్ తో మిక్స్ చేయడం సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇక సినిమాలో వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరంతా కామెడీలో మంచి గుర్తింపు పొందిన నటులే కావడంతో నవ్వుల సందడి ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో మూవీ టీమ్ ఎక్స్పీరియన్సెడ్ టెక్నీషియన్లను ఎంపిక చేసింది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.
బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మూవీ టైటిల్, ఫస్ట్ లుక్, ఫాంటసీ బ్యాక్ డ్రాప్, అల్లరి నరేష్ కామెడీ ఇమేజ్ కలిసి రంభ ఊర్వశి మేనక మూవీపై మంచి ఆసక్తి తీసుకొచ్చాయి. మరి సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా అల్లరి నరేష్ కు మరో కామెడీ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.