వెంకన్న తర్వాత భువనేశ్వరికే బండ్ల శుభలేఖ!
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. గణేష్ కూతురి వివాహ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు శుభారంభం పలుకుతూ ఆయన కుటుంబసభ్యులు సంప్రదాయబద్ధంగా తొలి వివాహ ఆహ్వాన పత్రికను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఏరువాక పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది.
ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, వెంకన్న ఆశీస్సులు పొందిన అనంతరం రెండో పెళ్లి కార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆశీర్వాదాలు తీసుకోవడం తమ కుటుంబానికి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని బండ్ల గణేష్ కుటుంబం వెల్లడించింది. ఆగస్టు 16న జరగనున్న తన కూతురి పెళ్లి విజయవంతంగా జరగాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
బండ్ల గణేష్‌కు నారా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కొత్తది కాదు. గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబంపై తనకు ఉన్న గౌరవాన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. ముఖ్యంగా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతుండగా, అతనికి నారా భువనేశ్వరి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆ బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసిన విషయం తెలిసిందే.
దానికంటే ముందు, చంద్రబాబు నాయుడు జైలు నుంచి ఎలాంటి మచ్చ లేకుండా నిర్దోషిగా బయటకు వచ్చి, తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తిరుమల శ్రీవారికి బండ్ల గణేష్ ప్రత్యేక మొక్కుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి రిలీజై ముఖ్యమంత్రి అయ్యాక ఆ మొక్కును నిలబెట్టుకుంటూ తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సంఘటన కూడా అప్పట్లో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇలాంటి నేపథ్యంలో తన కూతురి పెళ్లికి సంబంధించిన రెండో శుభలేఖను నారా భువనేశ్వరికి అందించడం కేవలం ఆహ్వాన కార్యక్రమమే కాకుండా, రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి మరో నిదర్శనంగా మారింది. ఒకవైపు శ్రీవారి ఆశీస్సులు, మరోవైపు తాము గౌరవించే కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో పెళ్లి వేడుకలకు శ్రీకారం చుట్టిన బండ్ల గణేష్ కుటుంబం ప్రస్తుతం వివాహ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆగస్టు 16న జరగనున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.