రెమ్యునరేషన్ కోసం కోర్టు మెట్లెక్కిన లేడీ డైరెక్టర్.. అసలేం జరిగిందంటే?
కోలీవుడ్ లో చోటుచేసుకున్న ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
సినిమా సూపర్ హిట్ అయింది.. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.. కానీ అదే మూవీకి దర్శకత్వం వహించిన దర్శకురాలు మాత్రం తనకు రావాల్సిన పారితోషికం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కోలీవుడ్ లో చోటుచేసుకున్న ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తనకు రావాల్సిన రూ.8.39 కోట్ల రెమ్యూనరేషన్ బకాయిల కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ వివాదం తెరపైకి వచ్చింది.
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన పరాశక్తి చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర, నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తనకు మొత్తం రూ.15 కోట్ల పారితోషికం ఇవ్వాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. జీఎస్టీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం మరింత పెరిగిందని, అయితే ఇప్పటివరకు రూ.9.31 కోట్లు మాత్రమే చెల్లించి, ఇంకా రూ.8.39 కోట్లను నిర్మాణ సంస్థ ఇప్పటికీ ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన పరాశక్తి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరినట్లు నిర్మాతలే ప్రకటించారు. సినిమా సక్సెస్ అయినప్పటికీ, దర్శకురాలికి అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం ఇప్పటికీ ఇవ్వకపోవడం సరైంది కాదని సుధా కొంగర తరపు న్యాయవాదులు వాదించారు.
ఇప్పటికే సినిమా ఓటీటీలో విడుదలైన నేపథ్యంలో, శాటిలైట్ హక్కులకు సంబంధించిన ట్రాన్సక్షన్స్ కొనసాగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా సినిమా ద్వారా కమర్షియల్ బెనిఫిట్స్ పొందడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. అందుకే చివరి నిమిషంలో కాకుండా ముందుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వివరించారు.
ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరాశక్తి చిత్రానికి సంబంధించిన శాటిలైట్ స్ట్రీమింగ్ కు సంబంధించిన ప్రక్రియను జులై 8 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఆ వ్యవహారంపై నిర్మాణ సంస్థ తమ వాదనలు వినిపించాలని సూచించింది. ఇక వివాదం మరో సినిమాపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదే నిర్మాణ సంస్థ నిర్మించిన ఇదయం మురళి చిత్రం జులై 10న విడుదలకు సిద్ధంగా ఉంది. పాత సినిమా బకాయిలు చెల్లించకుండా కొత్త సినిమా విడుదల చేయడం సరికాదని పేర్కొంటూ, ఆ మూవీ రిలీజ్ కూడా నిలిపివేయాలని సుధా కొంగర కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, జులై 7 లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించింది. ఆ తర్వాత జరిగే విచారణలో తదుపరి నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇదయం మురళి విడుదలపై కూడా ఆసక్తి నెలకొంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏం జరగనుందో వేచి చూడాలి.