సినిమా ఇండస్ట్రీలో 'IP రిజిస్ట్రేషన్' అంటే ఏమిటి? క్రియేటర్లకు ఇది ఎలా బ్రహ్మాస్త్రం?
సినిమా వ్యాపారం కోట్లలోకి, సరికొత్త ఫ్రాంచైజీలుగా విస్తరిస్తున్న తరుణంలో `ఐపి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లేదా మేధో సంపత్తి) రిజిస్ట్రేషన్` అనేది ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన అంశంగా మారింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సినీపరిశ్రమ కేవలం మూడు గంటల వినోదానికే పరిమితం కావడం లేదు. సినిమా వ్యాపారం కోట్లలోకి, సరికొత్త ఫ్రాంచైజీలుగా విస్తరిస్తున్న తరుణంలో `ఐపి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లేదా మేధో సంపత్తి) రిజిస్ట్రేషన్` అనేది ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఒక సినిమాను రూపొందించే క్రమంలో పుట్టే ప్రతి క్రియేటివ్ ఆలోచనను, సృష్టిని చట్టబద్ధంగా తమ సొంతం చేసుకోవడమే ఐపి రిజిస్ట్రేషన్. సంబంధిత ప్రభుత్వ లేదా కాపీరైట్ బోర్డుల ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వల్ల... ఆయా కంటెంట్‌పై సదరు నిర్మాణ సంస్థకు లేదా క్రియేటర్‌కు పూర్తి హక్కులు లభిస్తాయి. దీర్ఘకాలంలో వీటిని మరెవరూ కాపీ చేయడానికి లేదా అనుమతి లేకుండా వాడటానికి వీలుండదు.
ఈ ఐపి రిజిస్ట్రేషన్ పరిధిలోకి ముఖ్యంగా మూడు ప్రధానాంశాలు వస్తాయి. మొదటిది కథ కథనం.. ఒక రచయిత లేదా దర్శకుడు రాసుకున్న మూల కథ, డైలాగులు, స్క్రీన్‌ప్లేను వేరెవరూ దొంగిలించకుండా కాపీరైట్ చట్టం ద్వారా రక్షణ కల్పిస్తారు. రెండవది `పాత్రలు`... కథలో ఉండే ప్రత్యేకమైన క్యారెక్టర్ల రూపురేఖలు, ఆ పాత్రల ప్రవర్తన ... విలక్షణమైన శైలిని కూడా రిజిస్టర్ చేస్తారు. మూడవది `టైటిల్& ఫ్రాంచైజీ... సినిమా పేరుతో పాటు భవిష్యత్తులో వచ్చే సీక్వెల్స్, స్పిన్-ఆఫ్స్ లేదా వెబ్ సిరీస్‌ల వంటి `ఫ్రాంచైజీ` హక్కులన్నింటినీ లీగల్‌గా లాక్ చేస్తారు. దీనివల్ల ఆ సినిమాకు సంబంధించిన ప్రతి అంగుళం సృష్టికర్తల సొంతంగానే మిగిలిపోతుంది. కాపీ క్యాట్ రచయితల భరతం పట్టడానికి ఈ ఐపి హక్కు ప్రధాన ఆయుధంగా కోర్టుల్లో పని చేస్తుంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దీనికి అత్యుత్తమ ఉదాహరణ ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన `బాహుబలి`. ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవుడు, కట్టప్ప వంటి పాత్రల రూపాలు, పేర్లపై నిర్మాణ సంస్థ పూర్తి ఐపి రిజిస్ట్రేషన్లు చేసుకుంది. అందుకే `బాహుబలి` సినిమా ముగిసినా.. ఆ పాత్రలతో యానిమేషన్ సిరీస్‌లు, గ్రాఫిక్ నవలలు, గేమింగ్ యాప్స్, మర్చండైజ్ (బొమ్మలు, దుస్తులు) రూపంలో ఇప్పటికీ వందల కోట్ల వ్యాపారం సాగుతోంది. అదేవిధంగా ప్రశాంత్ నీల్ సృష్టించిన `సలార్` చిత్రంలోని `ఖాన్సార్` ప్రపంచం, అందులోని పాత్రల డిజైన్లను కూడా భవిష్యత్తు అవసరాల కోసం ఐపి పరిధిలోకి తెచ్చారు. రిజిస్టర్ చేసుకోవడం వల్ల వీటిని ఎవరూ కాపీ చేయడానికి కుదరదు.
ఇక ప్రస్తుత ట్రెండ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫార్ములా అయిన `సినిమాటిక్ యూనివర్స్`లకు ఈ ఐపి రిజిస్ట్రేషన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. టాలీవుడ్‌లో ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న `ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్` (PVCU) లోని హను-మాన్ వంటి సూపర్ హీరో పాత్రలు, కోలీవుడ్‌లో లోకేష్ కనగరాజ్ సృష్టించిన `లోకేష్ సినిమాటిక్ యూనివర్స్` (LCU) లోని విక్రమ్, డిల్లీ, రోలెక్స్ వంటి ఐకానిక్ క్యారెక్టర్లకు సంబంధించి పక్కాగా ఐపి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీనివల్ల ఒక దర్శకుడి సినిమాలోని పాత్రను లేదా ప్రపంచాన్ని మరొకరు తమ సినిమాల్లో వాడుకోవాలంటే లీగల్‌గా అనుమతులు (రాయల్టీలు) తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.
సినిమా రంగంలో ఐపి రిజిస్ట్రేషన్ల వల్ల ఒరిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇది క్రియేటర్లకు దీర్ఘకాలిక ఆర్థిక భరోసాను ఇస్తుంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద రన్ ముగిసిన తర్వాత కూడా... దానికి సంబంధించిన ఐపి రైట్స్ ద్వారా ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, రీమేక్ - గేమింగ్ రూపంలో యాజమాన్యానికి నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా ఆ కథను లేదా పాత్రలను కాపీ చేయడానికి ప్రయత్నిస్తే, కాపీరైట్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలు, న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు సదరు సంస్థకు ఉంటుంది. అందుకే నేటి తరం మేకర్స్ సినిమా షూటింగ్ కంటే ముందే ఐపి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
సెలబ్రిటీలకు ఐడెంటిటీ రైట్స్:
ఇక స్టార్ల విషయానికి వస్తే `ఐడెంటిటీ రైట్స్` కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యారాయ్ వంటి వారు కోర్టులలో ప్రత్యేక హక్కుల పరిరక్షణ పరిధిలోకి వచ్చారు. వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను లేదా వాయిస్ లను దుర్వినియోగం చేయడానికి, వాణిజ్య ప్రకటనల్లో అనుమతి లేకుండా వాడుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు.