అప్పుడు విశ్వంభర త్యాగం.. ఇప్పుడు విశ్వంభర కోసం త్యాగం?

అలా మళ్లీ మొదలైన వీఎఫెక్స్ పనులు ఎంతకీ ఒక కొలిక్కి రాక ఇప్పటికీ సినిమా విడుదల కాలేదు. ఈ ఏడాది కూడా సినిమా రిలీజవుతుందా అన్నది సందేహమే.

Update: 2026-09-06 12:30 GMT

ముందు అనుకున్న ప్రకారం అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ విడుదలై రెండున్నరేళ్లు దాటిపోయి ఉండాలి. సినిమా మొదలైనపుడు దీన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా టీజర్ లాంచ్ అయ్యాక అంతా మారిపోయింది. అందులో విజువల్స్, వీఎఫెక్స్ విషయంలో విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో.. మొత్తం కంటెంట్ మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది.

అలా మళ్లీ మొదలైన వీఎఫెక్స్ పనులు ఎంతకీ ఒక కొలిక్కి రాక ఇప్పటికీ సినిమా విడుదల కాలేదు. ఈ ఏడాది కూడా సినిమా రిలీజవుతుందా అన్నది సందేహమే. జులై అన్నారు, దసరా అన్నారు.. ఏదీ సాధ్యపడట్లేదు. ఐతే ‘విశ్వంభర’ లేటెస్ట్ టార్గెట్ 2027 సంక్రాంతి అంటూ కొత్త ప్రచారం మొదలైంది. కానీ అదే సమయంలో చిరు మరో చిత్రం ‘కాకా’ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మధ్యే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో జనవరి 13న రిలీజ్ అంటూ డేట్ కూడా వేసేశారు. మరి ‘విశ్వంభర’ ఎలా సంక్రాంతికి వస్తుందనే సందేహం కలగడం సహజం.

ఐతే ‘విశ్వంభర’కు సంబంధించి పని దాదాపుగా పూర్తి కావస్తున్నప్పటికీ.. విడుదల విషయంలో తర్జనభర్జనలు నడుస్తున్నది డిజిటల్ డీల్ దగ్గరేనట. ఈ సినిమాను కొంటున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్.. నిర్మాతలు కోరుకున్న రేటు కావాలంేసంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని కండిషన్ పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గత సంక్రాంతికి కూడా చిరుకు ఇలాంటి సంకట పరిస్థితే తలెత్తింది. ‘విశ్వంభర’ను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయడం మీద ఒక టైంలో చర్చ జరిగింది. ఐతే ఆ సినిమాను వేసవికి వాయిదా వేస్తూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ను సంక్రాంతికి తీసుకొచ్చారు. అప్పుడలా త్యాగం చేసింది ‘విశ్వంభర’ టీం. కానీ ఈ చిత్రం వేసవికి కూడా రాలేకపోయిందన్నది వేరే సంగతి.

ఐతే ఇప్పుడు ‘విశ్వంభర’ స్టేల్ ప్రాజెక్టులా మారిపోకూడదంటే సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో తీసుకురావడమే బెటర్. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా అదే కోరుకుంటోంది. ‘కాకా’ను సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే కొంచెం హడావుడి అవుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందుకే ఆ చిత్రాన్ని వేసవికి వాయిదా వేయించి ‘విశ్వంభర’ను సంక్రాంతికి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే గత ఏడాది ‘విశ్వంభర’ మరో చిరు సినిమా కోసం త్యాగం చేస్తే.. ఇప్పుడు ‘విశ్వంభర’ కోసం మరో మెగాస్టార్ మూవీ త్యాగం చేయాల్సి వస్తోందన్నమాట.

Tags:    

Similar News