చిరు సంక్రాంతి రేసు.. వచ్చేదెవరు? ఆగేదెవరు?
ముఖ్యంగా జనవరి 9వ తేదీ విశ్వంభర మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి.. ఈ విషయం ఇప్పటికే తెలిసిందే. కానీ ఈసారి ఒక్క సినిమాతో కాదు.. రెండు సినిమాలతో! అదేంటని అనుకుంటున్నారా.. ఒకవైపు కాకా డేట్ లాక్ చేసుకుని కూర్చుంటే.. మరోవైపు ఎప్పటి నుంచో ఊరిస్తున్న విశ్వంభర కూడా అదే సీజన్ పై కన్నేసిందట. దీంతో మెగా ఫ్యాన్స్ లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. చిరు సంక్రాంతికి వస్తే.. ఏ సినిమా వస్తుంది? ఏది ఆగుతుంది? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
విశ్వంభర, కాకా సినిమాలు ఇప్పుడు సంక్రాంతి రేసులో ఉన్నాయట. నిజానికి ఇప్పటికే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా సినిమాను వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కు ముందు విశ్వంభర మూవీని కూడా రంగంలోకి దించే ప్లాన్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా జనవరి 9వ తేదీ విశ్వంభర మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే.. సంక్రాంతి సీజన్ ను చిరంజీవి రెండు సినిమాలు టార్గెట్ చేసే పరిస్థితి అన్నమాట. అయితే ఒకే హీరోకు చెందిన రెండు భారీ సినిమాలు నాలుగు రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
అయితే ఎప్పుడో రావాల్సిన విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సోషియో ఫాంటసీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ విజువల్స్, ఫాంటసీ ఎలిమెంట్స్, చిరంజీవి యాక్షన్.. ఇలా సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులు చాలానే ఉన్నాయి. లేట్ అయినా భారీ రేంజ్ లో రావాలని చూస్తున్న ఆ సినిమాకు సంక్రాంతి సీజన్ కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు కాకా కూడా చిన్న సినిమా కాదు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే క్రేజ్ ఉంది. మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు మేకర్స్ డేట్ కూడా ప్రకటించారు. అయితే విశ్వంభర సంక్రాంతికి వస్తే.. కాకా పరిస్థితి ఏంటనేది ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఒకే సీజన్ లో చిరు సినిమాలు రెండూ రావడం కంటే.. ఒక మూవీని పోస్ట్ పోన్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని నెట్టింట చర్చ జరుగుతోంది. అదే జరిగితే కాకా సమ్మర్ కు షిఫ్ట్ వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ విషయంలో ప్రస్తుతానికి ఏదీ ఫైనల్ కాలేదట. కానీ సోషల్ మీడియాలో చర్చలు మాత్రం ఫుల్ గా సాగుతున్నాయి. ఇక సంక్రాంతి రేసులో చిరు ఉండడం పక్కానే.. కానీ రెండింట్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.