కష్టపడే వారికి పెంచితే తప్పా?
అసోసియేషన్ లతో సంబంధం లేకుండా కొత్త ప్రతిభను తీసుకొస్తామని నిర్మాతలు, 30 శాతం వేతనం పెంచకపోతే షూటింగులు జరగవని కార్మికులు దాడి ప్రతిదాడి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.;
అసోసియేషన్ లతో సంబంధం లేకుండా కొత్త ప్రతిభను తీసుకొస్తామని నిర్మాతలు, 30 శాతం వేతనం పెంచకపోతే షూటింగులు జరగవని కార్మికులు దాడి ప్రతిదాడి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనా కానీ టాలీవుడ్ ఐదురోజులుగా సమ్మె కారణంగా స్థంభించింది. షూటింగులు లేక నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. ఇదంతా నాయకుల వైఫల్యం కారణంగా ప్రతిష్ఠంభన అని అంటున్నారు చిన్న నిర్మాతల సంఘం మాజీ అధ్యక్షుడు, నిర్మాత నట్టి కుమార్. రెండు మూడు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వస్తానని హామీ ఇచ్చినట్టు ఆయన ధృవీకరించారు. అంతేకాదు.. షూటింగులు బంద్ చేయడం సరికాదు.. షూటింగులు చేస్తూ, మాట్లాడుకోవాలని చిరంజీవి కోరినట్టు నట్టి తెలిపారు.
విశ్వప్రసాద్ వ్యాఖ్యలు సరికాదు:
అంతేకాదు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ వ్యాఖ్యలను కూడా నట్టి తప్పు పట్టారు. సాఫ్ట్ వేర్ జీతాలతో సమానంగా టాలీవుడ్ కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నామని విశ్వప్రసాద్ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేసారు. ఆయన మాట్లాడుతూ.. ``మేం సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ ఇస్తున్నామని విశ్వప్రసాద్ అంటున్నారు! సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఒకటే ప్రశ్నిస్తున్నా..మీ నెత్తి మీద ఒక లైట్ పెడతాం లేదా మీ నెత్తిపై కెమెరా పెడతాము.. ఎంత ఎత్తు కొండ ఎక్కుతారో చూస్తాం..`` అని నట్టి అన్నారు. కెమెరా మోయడం నుంచి లైట్ మోయడం వరకూ అన్నిటికీ కష్టం ఎక్కువ. చాలా శ్రమించాలని అన్నారు. తెలుగు సినీరంగ కార్మికులు చాలా కష్టపడితేనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని కూడా నట్టి అన్నారు. మద్రాసు నుంచి పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చినప్పుడు తెలుగు వారు పని రాకపోవడం వల్ల చాలా అవమానాలు భరించారని, ఆ తర్వాత కసిగా నేర్చుకుని నేడు ప్రపంచం గర్వించదగిన సినిమాలకు పని చేస్తున్నారని కొనియాడారు నట్టి.
కష్టపడే వారికి పెంచితే తప్పా?
కష్టపడి లైట్ పట్టుకుని మోసుకుని కొండలపైకు వెళ్లే లైట్ మేన్ కి పేమెంట్ పెంచడం తప్పా? వేకువఝాము మొదలై, రాత్రి ఇంటికి దిగబెట్టే వరకూ కష్టపడే డ్రైవర్ కి భత్యం పెంచడం తప్పవుతుందా? అయ్యా అమ్మా అంటూ సెట్లో అందరికీ వండి పెట్టే ప్రొడక్షన్ టీమ్ కు పెంచడం తప్పవుతుందా? డ్యాన్సర్లు, ఫైటర్ అసిస్టెంట్లు ఇలా కార్మికులందరికీ పెంచకూడదా? అని ప్రశ్నించారు నట్టి కుమార్. 30శాతమా 20శాతమా 10 శాతమా మాట్లాడి పెంచండి.. అంతేకానీ పూర్తిగా కార్మికులను తప్పిస్తామని అనొద్దు. చిరంజీవి గారు అన్నారు. ముందుగా మీరు రెండు రోజుల్లో నిర్ణయించండి. కుదరకపోతే నేను మాట్లాడతాను అని అన్నారు. మాకు ఏ సమస్య ఉన్నా చిరంజీవి గారిని కలుస్తున్నామని నట్టికుమార్ వెల్లడించారు.
కొత్త ట్యాలెంట్ రావాలి కానీ..!
పెద్ద నిర్మాతలు కొత్త ట్యాలెంట్ ని తెస్తామంటున్నారు. కొత్త ప్రతిభ రావాలి.. కానీ వీళ్లు పడ్డ కష్టం కూడా చూడాలి. వేతన రేటు తగ్గించమని అడగండి.... మాట్లాడదాం..అంతేకానీ వీళ్లను పక్కకు పెట్టకూడదని నట్టి సూచించారు. మొత్తానికి నిర్మాత నట్టి కుమార్ మరో రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.