'ముఠా మేస్త్రి 4K' రీ-రిలీజ్.. ఆ రేంజులో మాస్ ఫీవర్ రాజేస్తుందా?
దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికీ డాన్స్ రియాలిటీ షోలలో పార్టిసిపెంట్లు అదే స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ రీ-క్రియేట్ చేస్తుండటమే ఆ పాట క్రేజ్‌కు సజీవ నిదర్శనం.
ఇటీవలి కాలంలో వరుసగా క్లాసిక్ సినిమాల 4కే మాస్టరింగ్ వెర్షన్లు రిలీజవుతూ బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధించడం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు అదే బాటలో ముఠామేస్త్రి విడుదలకు వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని ఆల్-టైమ్ క్లాసిక్ మాస్ హిట్ చిత్రాలలో ఒకటైన `ముఠా మేస్త్రి` థియేటర్లలోకి మళ్లీ రానుంది. నేటి ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా 4కే టెక్నాలజీతో సరికొత్త డిజిటల్ వర్షన్‌గా సిద్ధమైన `ముఠా మేస్త్రి 4K` ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ బర్త్‌డే కానుకగా వెండితెరపై మేస్త్రి మాస్ హంగామాను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముఠామేస్త్రి అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది అందులో లుంగీ కట్టి, మాస్ అవతార్‌లో చిరంజీవి కనిపించే తీరే! ముఖ్యంగా ఈ సినిమాలో ఐకానిక్ `హోయిరబ్బా` పాట ఒక మెరుపులాంటిది. ఆ పాటలో చిరంజీవి వేసిన మాస్ స్టెప్పులు, గ్రేస్ అప్పట్లో థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికీ డాన్స్ రియాలిటీ షోలలో పార్టిసిపెంట్లు అదే స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ రీ-క్రియేట్ చేస్తుండటమే ఆ పాట క్రేజ్‌కు సజీవ నిదర్శనం.
ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన అందాల భామలు మీనా, రోజాలు హీరోయిన్లుగా నటించారు. రాజ్-కోటి అందించిన చార్ట్‌బస్టర్ పాటలు, చిరు - హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు.. దానికి తోడు చిరు నోట వచ్చే పవర్‌ఫుల్ మాస్ డైలాగ్స్ ఈ సినిమాలోని ప్రతి అంశాన్ని రక్తి కట్టించాయి.
అయితే ఈ రోజుల్లో కాలం మారింది..ప్రేక్షకుల అభిరుచులు మారిన నేపథ్యంలో ఇటువంటి పక్కా మాస్ సినిమాని నేటి తరం తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే సందేహం రావచ్చు. ఇప్పటి ట్రెండ్ ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లు, థ్రిల్లర్‌ల వైపు సాగుతున్నా.. మాస్ సినిమాలకు ఉండే ప్రత్యేక ఆదరణ ఎప్పటికీ తగ్గదు. పైగా మెగాస్టార్ చిరంజీవికి ఉన్న తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ - క్రేజ్ దృష్ట్యా ఈ రీ-రిలీజ్‌కు భారీ స్పందన రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి తమ అభిమాన కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఆగస్టు 21న విడుదలవుతున్న `ముఠా మేస్త్రి 4K` విజువల్స్.. సౌండింగ్‌తో థియేటర్లను మరోసారి ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. మెగా అభిమానులకు ఈ రీ-రిలీజ్ ఒక మరువలేని పండుగ వాతావరణాన్ని అందించబోతోంది.