మెగా 158పై కొత్త డౌట్లు.. నిర్మాత మార్పు అవసరమా?
ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న కీవీఎన్ ప్రొడక్షన్స్ కు ఇటీవల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.;
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రాబోతోన్న మెగా 158 ప్రాజెక్ట్ పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ జోడీ మళ్లీ కలిసి పని చేయడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఆ సినిమా షూటింగ్ విషయంలో వరుస ఆలస్యాలు చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న కీవీఎన్ ప్రొడక్షన్స్ కు ఇటీవల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని లీకులు, ఇతర కారణాల వల్ల ఆ సంస్థ ప్రణాళికల్లో అంతరాయం కలిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న ప్రారంభం కావాల్సిన షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్ మారడంతో, ప్రాజెక్ట్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనే ఆ చిత్రానికి నిర్మాతలు మారే అవకాశముందని ప్రచారం జరిగినప్పటికీ, అప్పట్లో మెగాస్టార్ ను కన్విన్స్ చేసి అదే బ్యానర్ ను కొనసాగించినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ అదే ప్రశ్న ముందుకు వస్తోంది. ప్రొడక్షన్ సమస్యలు ఇలాగే కొనసాగితే నిర్మాత మార్పు అవసరమా? అనే చర్చ సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా జరుగుతోంది.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ- ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. నటీనటుల ఎంపిక కూడా దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. మెగాస్టార్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించనుండగా, కీలక పాత్రలో ప్రీతి ముకుందన్ కనిపించనున్నారని టాక్. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించనుండగా, బాలీవుడ్ దర్శకుడు కమ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో కనిపించే అవకాశముంది.
సంగీతం విషయంలో కూడా ఆ ప్రాజెక్ట్ కు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండటంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. కథాపరంగా సినిమా బెంగాల్ నేపథ్యంతో తెరకెక్కనుందని సమాచారం. తండ్రి- కూతురు భావోద్వేగాలను ప్రధానంగా చూపిస్తూ, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బాబీ ఆ చిత్రాన్ని రూపుదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపింది. అయితే అధికారిక అప్డేట్లు లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? నిర్మాత మార్పు ఉంటుందా? ప్రాజెక్ట్ షెడ్యూల్ ఎలా ఉంటుందనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే, వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో వర్క్ చేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ పై పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.