MSG ఓపెనింగ్స్ సంగతేంటి?

ముఖ్యంగా చాలా రోజుల తర్వాత చిరు సినిమాకు ప్రీమియర్ షోలు వేయడం అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.;

Update: 2026-01-11 07:21 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆదివారం (జనవరి 11) రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండటంతో సినిమా వైపు అందరి దృష్టి మళ్ళింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న ఆ సినిమాకు సంబంధించిన థియేటర్లు, టికెట్ కౌంటర్ల వద్ద ఇప్పటికే సందడి కనిపిస్తోంది.

ముఖ్యంగా చాలా రోజుల తర్వాత చిరు సినిమాకు ప్రీమియర్ షోలు వేయడం అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. రిలీజ్‌ కు ముందే సినిమా ఎలా ఉండబోతోందనే ఇంట్రెస్ట్ పెరగడంతో టికెట్ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే టికెట్లు వేగంగా సేల్ అవుతున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో తొలి రోజుకు సంబంధించిన షోలు హౌస్‌ ఫుల్ అవుతున్నాయి.

బుక్ మై షో వంటి ఆన్‌ లైన్ టికెటింగ్ ప్లాట్‌ ఫామ్స్‌ లో మన శంకర వరప్రసాద్ గారు మూవీ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. విడుదలకు ముందే బుకింగ్స్‌ లో కనిపిస్తున్న దూకుడు.. సినిమా ఓపెనింగ్స్‌ పై పాజిటివ్ సిగ్నల్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ తో పాటు మెగాస్టార్ అభిమానులు కూడా భారీ సంఖ్యలో టికెట్లు బుక్ చేస్తున్నారు.

ఇండియన్ మార్కెట్‌ తో పాటు ఓవర్సీస్‌ లో కూడా సినిమా ప్రీ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో ప్రీమియర్ షోలు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్టు సమాచారం. ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ చేరువలోకి వెళ్లిన బుకింగ్స్ ట్రెండ్స్ ను చూస్తుంటే.. మొదటి రోజు కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి.. మన శంకర వరప్రసాద్ గారు మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కించారని ఇప్పటికే సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవిని అభిమానులు కోరుకునే విధంగానే, సహజమైన కామెడీ, ఎమోషన్‌ తో చూపించారనే టాక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాపై ఆశలు పెట్టుకున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా కొన్ని సాంగ్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ సినిమాకు ఎక్స్ ట్రా బజ్ తీసుకొచ్చాయి. ఈ అంశాలన్నీ కలిసి ఓపెనింగ్స్‌ పై అంచనాలను మరింత పెంచాయి. అయితే ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే ఇక తిరుగులేదు. భారీ వసూళ్లు వస్తాయి. మరి MSG తొలి రోజు ఎంత సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News