MSG నాన్ స్టాప్ ప్రమోషన్స్.. మేకర్స్ టార్గెట్ అదేనా?
టూర్ లో భాగంగా నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అనంతపురం, వరంగల్, హైదరాబాద్ తో పాటు బెంగళూరు నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేశారు.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్.. ప్రమోషన్స్ ను మరింత జోష్ లో నిర్వహిస్తున్నారు. తాజాగా ఆడియన్స్ లో అంచనాలు ఫుల్ గా పెంచేలా చేసిన ట్రైలర్ ను శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్ లో ఘనంగా విడుదల చేశారు. మెగాస్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరైన ఆ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రమోషన్లను మరో రేంజ్ కు తీసుకెళ్లాలని మేకర్స్ భారీ ప్రణాళికను రెడీ చేశారు. తిరుపతి ఈవెంట్ ను స్టార్టింగ్ గా తీసుకుని, సినిమా విడుదల వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కవర్ చేస్తూ ప్రమోషన్ టూర్ చేయనున్నారు.
టూర్ లో భాగంగా నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అనంతపురం, వరంగల్, హైదరాబాద్ తో పాటు బెంగళూరు నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఇప్పటికే రాజమండ్రిలో నిర్వహించిన ఈవెంట్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. మిగిలిన నగరాల్లో కూడా ఇలాంటి ఉత్సాహమే కనిపించనుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కావడం, అనిల్ రావిపూడి వంటి హిట్ దర్శకుడి కాంబినేషన్ ఉండడంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం సహజమేనన్న నమ్మకం కూడా ఉంది.
అయితే, ఈసారి దర్శకుడు అనిల్ రావిపూడి ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు నయనతార వంటి స్టార్ హీరోయిన్ నటించినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో నాన్ స్టాప్ ప్రమోషన్లు చేపట్టడం గమనార్హం. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రంగా ఉండటంతో, ఓపెనింగ్స్ పై గట్టిగా ఫోకస్ చేసి ముందుకు వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలి రోజు కలెక్షన్లే సినిమాకు కీలకంగా మారుతాయన్న అంచనాతోనే దూకుడుతో మేకర్స్ ప్రమోషన్లు చేస్తున్నారని సమాచారం. మొత్తానికి, మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ప్రచారంలో కూడా పూర్తి స్త్రెంగ్త్ ను పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి మేకర్స్ ప్లాన్.. బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.