చిరంజీవిపై ఏ అసత్య ప్రచారానికైనా ముందుంది ముసళ్ల పండగ!
మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సాగుతున్న అసత్య ప్రచారాలు టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సాగుతున్న అసత్య ప్రచారాలు టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిరంజీవి ఆరోగ్యంపై క్లిక్‌బైట్ థంబ్‌నైల్స్‌తో తప్పుడు వార్తలు రాస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఒక యూట్యూబ్ చానెల్‌పై హైదరాబాద్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను, ఆరోగ్యాన్ని వ్యూస్ కోసం వాడుకుంటూ బౌండరీలు దాటుతున్న కొన్ని డిజిటల్ ఛానెళ్ల ధోరణికి చెక్ పెట్టేలా ఈ చట్టపరమైన చర్యలు ప్రారంభం కావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదానికి సంబంధించి హైదరాబాద్‌లోని కమలాపురి కాలనీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సదరు యూట్యూబ్ చానెల్ కావాలనే చిరంజీవి ఎడిట్ చేసిన ఫోటోలను, తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తూ ఆయన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, వీడియో క్లిప్‌లను పక్కా ఆధారాలు సహా ఆయన పోలీసులకు సమర్పించారు. ఈ వ్యవహారంపై స్థానిక కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు సదరు ఛానెల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
చిరు అనుమతి లేకుండా పేరును ఉపయోగించినా..!
నిజానికి ఈ పరిణామం జరగడానికి కొద్దిరోజుల ముందే మెగాస్టార్ చిరంజీవి తన వ్యక్తిత్వ, గుర్తింపు హక్కుల రక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరును, వాయిస్‌ను, ఫోటోలను లేదా డిజిటల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాల కోసం... అలాగే తప్పుడు ప్రచారాల కోసం ఎవరూ వినియోగించకుండా నిరోధించాలని చిరు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో చిరంజీవికి అనుకూలంగా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సెలబ్రిటీల ఐడెంటిటీని వారి అనుమతి లేకుండా వాడటం చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఇకపై ఎవరైనా చిరంజీవి ఫోటోలు, వీడియోలు, వాయిస్ లేదా ఆయన ఐడెంటిటీని తప్పుడు ప్రచారాల కోసమో... వాణిజ్య ప్రకటనల కోసమో లీగల్ పర్మిషన్ లేకుండా ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సదరు వ్యక్తులు లేదా సంస్థలు కోర్టు నిందనలతో పాటు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు. ఈ చట్టపరమైన రక్షణ కేవలం చిరంజీవికే కాకుండా.. డిజిటల్ యుగంలో తప్పుడు వార్తలతో ఇబ్బంది పడుతున్న ఎందరో సినీ ప్రముఖులకు ఒక ఆయుధంగా మారనుంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, అభిషేక్ బచ్చన్ వంటి వారు ఈ తరహా మద్ధతును కోర్టు నుంచి పొందిన సంగతి తెలిసిందే.
యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో వ్యూస్- సబ్‌స్క్రైబర్ల కోసం సెలబ్రిటీల చావు బతుకులతో.. ఆరోగ్యంతో చెలగాటం ఆడే థంబ్ నెయిల్స్ సంస్కృతికి తాజాగా మెగాస్టార్ లాయర్ పెట్టిన కేసు ఒక గట్టి హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టు తీర్పు, పోలీసుల తక్షణ చర్యల వల్ల భవిష్యత్తులో గాసిప్ ఛానెళ్లు నటీనటుల వ్యక్తిగత విషయాలపై వార్తలు రాసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇతరుల వ్యక్తిగత హక్కులను కాలరాయడానికి వీల్లేదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.