ఇండస్ట్రీకి మెగాస్టార్ తల్లీబిడ్డా న్యాయం!
దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానంతరం తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.;
దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానంతరం తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయినా తానెప్పుడు పెద్ద అనే హోదాను ఎక్కడా ప్రదర్శించలేదు. పరిశ్రమ చిరంజీవిని పెద్దగా గుర్తించి కట్టబెట్టిన పీఠమది. అందుకు తగ్గట్టే మెగాస్టార్ చిత్ర పరిశ్రమలో సమస్యలను పరిష్కరిస్తున్నారు. తానెంత బిజీగా ఉన్నా కళామాతల్లి ఇబ్బందుల్లో ఉందంటే? దాసరి తరహాలో ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం నిర్మాతలు వర్సెస్ సినీ కార్మికుల మధ్య వేతనాల విషయమై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే బంద్ ప్రకటనతో ఎక్కడ షూటింగ్ లు అక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికుల డిమాండ్ ను నిర్మాతలు అంగీకరించేదు లేదని స్వరం గట్టిగానే వినిపిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే చిరంజీవి వద్దకు పంచాయతీ చేరింది. కొంత మంది నిర్మాతలంతా నిన్నటి రోజున చిరంజీవిని కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. పెరిగిన కాస్ట్ ప్రొడక్షన్ తో కొత్తగా కార్మికులకు వేతనాలు పెంచాలంటే తలకు మించిన భారమవుతుందని తమ గోడును విన్నవించుకున్నారు. చిరంజీవి కూడా రెండు మూడు రోజులు చూసి సీన్ లోకి వస్తానన్నారు.
ఈ లోగా సమస్య పరిష్కారమైతే ఒకే! లేదంటే? తాను చెప్పిందే ఓ పరిష్కారంగా అంతా భావించాలి. అయితే చిరు విన్నది నిర్మాతల వెర్షన్ మాత్రమే. వర్కర్స్ యూనియన్ ఇంకా చిరంజీవిని కలవలేదు. వాళ్ల వెర్షన్ కూడా చిరంజీవి వింటానన్నారు. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే చిరంజీవి ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా? అది ఇరువురికి ఆమోదయోగ్యంగా..తల్లీ బిడ్డా న్యాయంగానే ఉండాలి. 30 శాతం వేతనాలు పెంచాలన్నది వర్కర్స్ యూనియన్ డిమాండ్. అంత ఇవ్వలేము అన్నది నిర్మాతల వెర్షన్. మరి ఈ సమస్యకు చిరంజీవి ఎలాంటి పరిష్కారం చూపిస్తారో చూడాలి.