దేశాన్ని ఒక్కటి చేసిన ఘనత ఆయనకే సాధ్యం..
అలా హైదరాబాదులో జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఈ ముగ్గురు భాగమయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..;
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, డిజిపి బి.శివధర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ లు పాల్గొన్నారు. అలా హైదరాబాదులో జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఈ ముగ్గురు భాగమయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మొదట నివాళులర్పించారు. ఆ తర్వాత సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యత సందేశం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ మాట్లాడారు.
చిరంజీవి మాట్లాడుతూ.. "సర్దార్ వల్లభాయ్ పటేల్ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేవారు. ఇది ఆయన ఇచ్చిన ఒక మంచి సందేశం.. 560 ముక్కలైన భారతదేశాన్ని ఒక్కటిగా కలిపిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దే.. ఆయన వల్లే మనం ఇప్పుడు అందరం ఒక్కటిగా ఉన్నాం. ఆయన ఇచ్చిన విజన్ వల్లే దేశం ఇలా ఉంది. మనం ఆయన ఇచ్చిన భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి యువత ఇన్స్పైర్ అయ్యే కార్యక్రమాలు హైదరాబాద్ పోలీసులు చేయడం నిజంగా దేశానికి గర్వకారణం.. హైదరాబాదులో ఇలాంటి కార్యక్రమాలు చేయడం.. దీనిలో నాలాంటి వ్యక్తిని భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది"..అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
అలాగే ప్రతి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి.సర్దార్ పటేల్ మన దేశానికి ఇచ్చిన ఏకత్వం.. వన్ నేషన్.. ఐక్యత.. ఎందుకంటే మనది వైవిధ్యభరితమైన దేశం.... విభిన్న భాషలు, విభిన్న వంటకాలు, సంస్కృతి ఉన్నాయి.అయినప్పటికీ మనం ఒక్కటిగా ఉన్నాం... ఆ ప్రేరణకు మూలం భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ పటేల్.ఇలాంటి వేడుకలు హైదరాబాద్ పోలీసులు ఇంకా మరెన్నో జరపాలని కోరుకుంటున్నాను.. ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు ధన్యవాదాలు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్ అని పిలుస్తారు. అలా అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా దీన్ని ఒక పండగ లాగా జరుపుకుంటారు. భారతదేశ అత్యంత సాహసోపేత స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరిగా పటేల్ని గౌరవిస్తారు.
ఇక రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో చిరంజీవి తన డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల గురించి కూడా స్పందించారు.. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది.. ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా.. ఆపద వచ్చినా.. పోలీసులు మేము ఉన్నాం అంటూ వారికి తోడునీడగా నిలుస్తూ రక్షిస్తున్నారు. ఇక ఈ మధ్యనే నాకు సంబంధించి కొన్ని డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి.అశ్లీల వెబ్సైట్ లో నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు,ఫోటోలు క్రియేట్ చేశారు. ఇక ఈ డీప్ ఫేక్ క్రియేటెడ్ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు చాలా తొందరగా చర్యలు తీసుకున్నారు. డీప్ ఫేక్ అనేది ఒక గొడ్డలి పెట్టు లాగా మారిపోయింది.ఇప్పటికే ఈ డీప్ ఫేక్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలియజేశాను.
ఈ డీప్ ఫేక్ విషయాన్ని సిపి సజ్జనార్, డిజిపి ఇద్దరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలి కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. సైబర్ నేరగాళ్లకు, డీప్ ఫేక్ చేసే వాళ్లకు అస్సలు భయపడకూడదు వెంటనే పోలీసులను సంప్రదించాలి.. గవర్నమెంట్ కూడా వీటిపై ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని కోరుతున్నాను. ఈ టెక్నాలజీ వల్ల కొంత లాభం,కొంత నష్టం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకే వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.