నా ఫోకస్ వాయిపుత్రపైనే.. కొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తా: చందూ మొండేటి

ఇప్పుడు సోషల్ ఫాంటసీ జోనర్ లో యానిమేషన్ మూవీ వాయుపుత్ర తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందించనున్నారు.;

Update: 2025-09-12 11:30 GMT

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చందూ మొండేటికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా తండేల్ మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు సోషల్ ఫాంటసీ జోనర్ లో యానిమేషన్ మూవీ వాయుపుత్ర తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందించనున్నారు.

ఇప్పటికే సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది దసరాకు సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే సోషియో ఫాంటసీ మూవీ కార్తికేయ 2తో బ్లాక్‌ బస్టర్ విజయం తర్వాత ఇప్పుడు మళ్లీ అదే జోనర్ లో వర్క్ చేయనున్నారు చందూ. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హనుమంతుడు తన నిజమైన సామర్థ్యాన్ని గ్రహించి, సీతాదేవిని వెతుకుతూ సముద్రం మీదుగా దూకి, అసాధారణ విన్యాసాలు చేసిన ఆ క్షణంపై వాయుపత్ర కథ దృష్టి పెడుతుందని చందూ మొండేటి తెలిపారు. తాను మహాభారతం, రామాయణం వంటి భారతీయ ఇతిహాసాల నుంచి లోతుగా ఎప్పుడూ ప్రేరణ పొందుతానని చెప్పారు.

ముఖ్యంగా తాను ఎప్పుడూ యానిమేషన్‌ ను ఆస్వాదిస్తానని, అది మార్వెల్ సినిమాలు అయినా లేదా డెమోన్ స్లేయర్ అయినా, పిల్లలతో కలిసి చూస్తానని తెలిపారు. ఇప్పుడు మన పౌరాణికాలను అదే ఉత్సాహభరితమైన రీతిలో సజీవంగా తీసుకురావాలనుకుంటున్నానని చెప్పారు. కార్తికేయ 2లో శ్రీకృష్ణుని శక్తిని ప్రదర్శించిన తర్వాత, హనుమంతుడు మహిమను ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

అదే సమయంలో ఇటీవల రిలీజ్ అయిన మహావతార నరసింహ చిత్రం తమను ప్రోత్సహిస్తుందని తెలిపారు చందూ. ఆ సినిమా డొవోషనల్ యానిమేషన్‌ కు భారీ మార్కెట్ ఉందని, ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ కాగలదని నిరూపించిందని తెలిపారు. ఇది వాయుపుత్రను ప్రయత్నించడానికి తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లు వెల్లడించారు.

అందుకే తన సినిమా ద్వారా హిందూ దేవుళ్ల గొప్పతనాన్ని, ముఖ్యంగా హనుమంతుడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో సినిమా యానిమేషన్‌ తో ఉంటుంది కాబట్టి.. ఎలాంటి పరిమితులు లేవని, కథను తాను ఊహించినట్లుగానే చెప్పగలనని అన్నారు.

ఐదుగురు సాంకేతిక నిపుణులతో కూడిన తన ప్రధాన బృందం మొదట స్టోరీబోర్డ్‌ ను సృష్టిస్తుందని, ఆ తర్వాత దాదాపు 50- 100 మంది సభ్యులతో కూడిన వీఎఫ్ ఎక్స్ తన కథకు రూపాన్ని తెస్తుందని తెలిపారు. బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడం తనకు ఎప్పుడూ ఒక కలని, కానీ ఇప్పుడు నా పూర్తి దృష్టి వాయుపుత్రపైనే ఉందని తెలిపారు. సినిమాను వేరే లెవెల్ లో తీసి కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News