ఈ సెలబ్రిటీల క్రేజ్‌కు డిజిటల్ ప్రచారం అవసరమే లేదు!

చాలా మంది నటీనటులు కోట్లాది ఫాలోవర్లతో తమ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్న ఈ కాలంలో, సోషల్ మీడియా అకౌంట్స్ లేకుండానే టాప్ లో కొనసాగుతున్న కొంతమంది స్టార్‌లు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

Update: 2026-06-23 17:30 GMT

ప్రస్తుతం సినీ ప్రపంచంలో సోషల్ మీడియా ఒక స్టార్ కెరీర్‌లో కీలక భాగంగా మారిపోయింది. సినిమా అప్‌డేట్లు, ప‌ర్స‌న‌ల్ విషయాలు, ఫ్యాన్స్ తో చిట్‌చాట్స్, ప్రమోషన్లు.. ఇలా అన్నింటికీ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్ ప్రధాన సాధనాలుగా మారాయి. చాలా మంది నటీనటులు కోట్లాది ఫాలోవర్లతో తమ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్న ఈ కాలంలో, సోషల్ మీడియా అకౌంట్స్ లేకుండానే టాప్ లో కొనసాగుతున్న కొంతమంది స్టార్‌లు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ ఈ లిస్ట్ లో ముందువరుసలో ఉంటారు. సోషల్ మీడియాలో అఫీషియల్ అకౌంట్స్ లేకపోయినా ఆయనకు ఉన్న అభిమానుల సంఖ్య, సినిమాలపై ఉండే అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. ఆయన ప్రతి సినిమా అనౌన్స్‌మెంట్ నేష‌న‌ల్ లెవెల్ లో చర్చనీయాంశమవుతుంది. అదే విధంగా ఆమిర్ ఖాన్ కూడా సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగానే ఉంటారు. అయినప్పటికీ ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కంటెంట్‌కు ప్రాధాన్య‌మిచ్చే నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

మరోవైపు సైఫ్ అలీ ఖాన్ కు కూడా అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. అయినా ఆయన ప‌ర్స‌న‌ల్ లైఫ్, సినీ ప్రాజెక్టులు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఇదే కోవలో ప్రముఖ నటి రాణీ ముఖ‌ర్జీ కూడా సోషల్ మీడియా ప్రచారానికి దూరంగా ఉంటూ తన సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత మిస్టీరియస్ స్టార్లలో ఒకరిగా భావించే రేఖ కూడా సోషల్ మీడియాలో లేరు. అయినప్పటికీ ఆమె ఎక్కడ కనిపించినా వార్తగా మారుతుంది. ఆమె వ్యక్తిత్వం, స్టైల్, ప్రజల్లో ఉన్న ఆసక్తి ఇప్పటికీ తగ్గకపోవడం విశేషం.

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ కూడా సోషల్ మీడియా హడావుడికి దూరంగానే ఉంటారు. అయినప్పటికీ ఆయన నటించిన ప్రతి సినిమా దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్‌లో ఆయనకు ఏర్పడిన క్రేజ్ దీనికి నిదర్శనం. ఇక సీనియర్ నటి జ‌య బ‌చ్చ‌న్ కూడా సోషల్ మీడియా వేదికల్లో కనిపించరు. అయినప్పటికీ ఆమెకు సంబంధించిన ప్రతి పబ్లిక్ అపియరెన్స్ నేష‌న‌ల్ మీడియాలో ప్రధాన వార్తగా మారుతుంది.

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా లేకుంటే స్టార్‌డమ్ నిలవదనే అభిప్రాయాన్ని ఈ ప్రముఖులు పూర్తిగా తప్పు అని నిరూపిస్తున్నారు. ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా ఒక మార్గం మాత్రమే కానీ స్టార్ విలువను నిర్ణయించే ప్రమాణం కాదని వీరి కెరీర్లు చెబుతున్నాయి. సినిమాలు, యాక్టింగ్, వ్యక్తిత్వం, ప్రేక్షకుల్లో ఏర్పడిన నమ్మకం ఉంటే సోషల్ మీడియా అకౌంట్స్ లేకపోయినా అసాధారణమైన స్టార్‌డమ్‌ను కొనసాగించవచ్చని ఈ సెలబ్రిటీలు మరోసారి రుజువు చేస్తున్నారు.

Tags:    

Similar News