ఆర్జీవీ, యాంక‌ర్ స్వ‌ప్న‌ల‌పై ఫిర్యాదు.. ఎందుకంటే!

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా ఎంతో మంచి పేరున్న రామ్ గోపాల్ వ‌ర్మ నుంచి ప్ర‌స్తుతం ఆక‌ట్టుకునే సినిమాలేమీ రావ‌డం లేదు.;

Update: 2025-04-10 10:23 GMT

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా ఎంతో మంచి పేరున్న రామ్ గోపాల్ వ‌ర్మ నుంచి ప్ర‌స్తుతం ఆక‌ట్టుకునే సినిమాలేమీ రావ‌డం లేదు. ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్లుగా ఉన్న వారంతా ఆయ‌న్ను ఎంతో అభిమానించేవాళ్లే. అంత‌టి టాలెంట్ ఉన్న రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకూనే ఉంటారు. ఏదొక విష‌యం గురించి మాట్లాడుతూ వార్త‌ల్లో ఉండే ఆర్జీవీ పై ఇప్పుడు ఓ కేసు న‌మోదైంది.

మ‌నోభావాల‌ను దెబ్బ తీసినందుకు ఆర్జీవీ మ‌రియు ప్ర‌ముఖ యాంక‌ర్ స్వ‌ప్న‌పై ఫిర్యాదు దాఖ‌లైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్య‌క్షుడు, హైకోర్టు అడ్వ‌కేట్ మేడా శ్రీనివాస్.. రామ్ గోపాల్ వ‌ర్మ, యాంక‌ర్ స్వ‌ప్న‌పై రాజ‌మండ్రిలోని త్రీ టౌన్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశారు. ద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేసి హిందూ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశార‌ని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.

రామ్ గోపాల్ వ‌ర్మ‌, స్వ‌ప్న సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయిన ఫేస్ బుక్, యూట్యూబ్ లో ఆ కంటెంట్ ను పోస్ట్ చేశార‌ని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. మేడా శ్రీనివాస్ త‌న పార్టీ కార్య‌కర్త‌ల‌తో క‌లిసి లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదుతో పాటూ డాక్యుమెంట‌రీ ఆధారాల‌ను కూడా పోలీసుల‌కు స‌మ‌ర్పించారు. ఆర్జీవీ, స్వ‌ప్న చేసిన కామెంట్స్ హిందూ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉండ‌టంతో పాటూ జాతీయ‌, సామాజిక స‌మ‌గ్ర‌త‌కు ఆ కామెంట్స్ ముప్పు క‌లిగిస్తున్నాయ‌ని మేడా శ్రీనివాస్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

రామ్ గోపాల్ వ‌ర్మ హిందూ దేవుళ్ల గురించి అగౌర‌వంగా మాట్లాడార‌ని, హిందూ ప‌విత్ర గ్రంథాలైన రామాయ‌ణం, మ‌హాభార‌తాల‌ను ఆయ‌న అప‌హాస్యం చేశార‌ని శ్రీనివాస్ పోలీసుల‌కు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు. భార‌త్ న్యాయ సంహిత లోని అవ‌స‌ర‌మైన సెక్ష‌న్ల గురించి కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఆర్జీవీ, స్వ‌ప్న‌పై కేసు న‌మోదు చేసి వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ్రీనివాస్ పోలీసుల‌ను కోరారు.

Tags:    

Similar News