షాకింగ్: సహనటుడి కెరీర్ విషయంలో మెగాస్టార్ అలా ఆలోచించారా?
దర్శకుడు గుణశేఖర్ స్క్రిప్ట్‌లో ఆ పాత్ర ప్రాధాన్యతను.. స్క్రీన్‌ప్లేలో దాని ప్రాముఖ్యతను వివరించిన తర్వాతే చిరంజీవి సంతృప్తి చెందారు.
రంగుల ప్రపంచంలో కుటిలత్వం గురించి ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ మంచి కూడా ఉంటుందని కొందరికే తెలుసు. ఇప్పుడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ చెప్పిన ఒక విషయం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. కెరీర్ పరంగా మెట్లు ఎక్కేప్పుడు కాళ్లు పట్టి లాగేవాళ్లు ఉన్న ఇదే ఇండస్ట్రీలో సహచరుడు కూడా `పై మెట్లు ఎక్కాల`ని ఆశించే- సహకరించే సహచరులు, పెద్దరికం ఉంటాయని ఆయన వివరించారు. ఇంతకీ బ్రహ్మాజీని వెన్ను తట్టి ప్రోత్సహించింది ఎవరో తెలుసా.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి.
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కేవలం తన నటన, డాన్సులు, బాక్సాఫీస్ రికార్డులతోనే కాకుండా... తోటి నటీనటుల పట్ల ఆయన చూపించే ఆప్యాయత... వారి కెరీర్‌పై తీసుకునే ప్రత్యేక శ్రద్ధతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఒక సినిమా తీస్తున్నప్పుడు అందులో నటించే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల ప్రాధాన్యతను కూడా ఆయన ఎంత నిశితంగా గమనిస్తారో చెప్పడానికి ఒకనాటి బ్లాక్‌బస్టర్ హిట్ `చూడాలని ఉంది` (1998) సెట్స్‌లో జరిగిన ఓ సంఘటన ఉత్తమ ఉదాహరణ. నటుడు బ్రహ్మాజీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసిన ఈ విషయాలు చిరంజీవి గారి గొప్ప వ్యక్తిత్వానికి, దూరదృష్టికి అద్దం పడుతున్నాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించిన `చూడాలని ఉంది` చిత్రం ఎక్కువ భాగం కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. ఆ సమయంలో `సింధూరం` సినిమాతో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మాజీని ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి ఆశ్చర్యపోయారు. ఇప్పుడే హీరోగా చేసిన బ్రహ్మాజీని కలకత్తా నేపథ్యంలో వచ్చే ఒక చిన్న పాత్రకు ఎలా అనుకుంటారు? నిర్మాత దత్తు గారు ఎప్పుడూ చిన్న పాత్రలకు కూడా పెద్ద నటులనే పెడుతుంటారు.. కానీ ఇప్పుడే హీరో అయిన బ్రహ్మాజీ కెరీర్‌ను మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా! అని ఆలోచించారు.
సహనటుడి కెరీర్ పాడవకూడదనే ఉద్దేశంతో చిరంజీవి వెంటనే దర్శకుడు కృష్ణవంశీకి ఫోన్ చేసి.. ``బ్రహ్మాజీ నా అభిమాని అయి ఉండి.. నాతో నటించాలని ఆరాటపడటం వేరు.. కానీ అతని కెరీర్ ముఖ్యం కదా!`` అని తన ఆందోళనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా... అదే రోజు రాత్రి 12 గంటలకు దర్శకుడు గుణశేఖర్‌ను నిద్రలేపి మరీ..బ్రహ్మాజీని ఈ పాత్రలో ఎలా ప్రజెంట్ చేయబోతున్నావు? అసలు స్క్రీన్‌ప్లే ఏంటి? ఒక హీరోగా చేసిన నటుడిని మనం పొరపాటున కూడా మిస్‌యూజ్ చేయకూడదు! అని స్క్రిప్ట్ వివరాలన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
దర్శకుడు గుణశేఖర్ స్క్రిప్ట్‌లో ఆ పాత్ర ప్రాధాన్యతను.. స్క్రీన్‌ప్లేలో దాని ప్రాముఖ్యతను వివరించిన తర్వాతే చిరంజీవి సంతృప్తి చెందారు. కేవలం తన పాత్ర, తన విజయం మాత్రమే కాకుండా... సినిమాలో నటించే ఇతర నటుల పాత్రలు ఎలా తెరకెక్కుతున్నాయి? వారి భవిష్యత్తుకు ఆ పాత్రలు ఎలా ఉపయోగపడతాయని ఒక అగ్ర కథానాయకుడు ఇంతలా ఆలోచించడం నిజంగా విశేషం. ఈ సంఘటనతో చిరుకు సినిమా రంగంలో తన సహచరులపై ఉన్న గౌరవం, ప్రేమ- బాధ్యతాయుతమైన ప్రవర్తన స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ పక్కన ఉన్న నటుడి ఎదుగుదలను కాంక్షించే మనస్తత్వం... వారి కెరీర్‌కు ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూసే పెద్దరికం కొందరిలోనే ఉంటుంది. `చూడాలని ఉంది` చిత్రంలో బ్రహ్మాజీ పాత్ర విషయంలో మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న ఈ శ్రద్ధ ఆయనలోని పరిపూర్ణమైన మానవత్వాన్ని... పరిశ్రమపై ఆయనకు ఉన్న గౌరవాన్ని చాటిచెబుతోంది. అందుకే దశాబ్దాలు గడిచినా ఆయన ఇప్పటికీ మెగాస్టార్‌గా సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక సినీపరిశ్రమలోకి ఎక్కువమంది ఔట్ సైడర్స్- ప్రతిభావంతులు రావాలని బహిరంగ వేదికలపై ప్రకటించిన మొట్టమొదటి హీరోగా చిరంజీవి వ్యక్తిత్వం, మనస్తత్వం ప్రజలందరికీ సుపరిచితమే.