ఇష్టం వ‌చ్చిన‌ట్టు కామెంట్ చేస్తే! స్టార్ హీరో పొరుగు వ్య‌క్తికి స‌ర‌దా తీర్చిన కోర్ట్!!

ఎవ‌రైనా సెల‌బ్రిటీ లేదా న‌టీన‌టులపై ఇష్టానుసారం సోష‌ల్ మీడియాల్లో పోస్టులు పెడ‌తామంటే ఇక‌పై కుద‌ర‌దు.

Update: 2026-06-12 03:58 GMT

ఎవ‌రైనా సెల‌బ్రిటీ లేదా న‌టీన‌టులపై ఇష్టానుసారం సోష‌ల్ మీడియాల్లో పోస్టులు పెడ‌తామంటే ఇక‌పై కుద‌ర‌దు. సైబ‌ర్ క్రైమ్ కేసులు ఇప్పుడు మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటున్నాయి. అదే క్ర‌మంలో కోర్టుల జోక్యంతో సెల‌బ్రిటీల‌కు పెద్ద ఊర‌ట ల‌భిస్తోంది. సెల‌బ్రిటీల‌ను ప‌బ్లిక్ ప్రాప‌ర్టీగా భావించి ఏదో ఒక కామెంట్ చేసేస్తామంటే ఇంత‌కుముందులా కుద‌రదు. బాలీవుడ్ అగ్ర హీరో స‌ల్మాన్ విష‌యంలో తాజా హైకోర్టు తీర్పు దీనికి నిద‌ర్శ‌నం.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు .. ఆయన పాన్వెల్ ఫామ్‌హౌస్ పొరుగున ఉండే కేతన్ కక్కడ్‌కు మధ్య గత కొన్నేళ్లుగా నడుస్తున్న ఆస్తి వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా అందుబాటులో ఉంది కదా అని ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పరువు నష్టం కలిగించే పోస్టులు పెట్టడాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తార‌ని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా.. సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని పొరుగు వ్యక్తికి కోర్టు సూచించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. తనపై సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేతన్ కక్కడ్‌పై సల్మాన్ ఖాన్ 2022లో సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే అప్పట్లో సివిల్ కోర్టు సల్మాన్‌కు మధ్యంతర ఉపశమనం (ఇంటెరిమ్ రిలీఫ్) ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌ను విచారించిన జస్టిస్ షర్మిలా దేశ్‌ముఖ్‌తో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్.. ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలా సోషల్ మీడియాలో కంటెంట్ అప్‌లోడ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ వివాదాస్పద పోస్టులను థర్డ్ పార్టీలు అప్‌లోడ్ చేసి ఉంటే వాటిని తొలగించడానికి సామాజిక మాధ్యమ సంస్థలు చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది.

గతంలో సల్మాన్ తరపు న్యాయవాది కోర్టులో వాదిస్తూ.. కేతన్ కక్కడ్ యూట్యూబ్ వీడియోలు, ట్వీట్ల ద్వారా సల్మాన్‌పై అత్యంత దారుణమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌కు అండర్‌వరల్డ్ డాన్ `డి-గ్యాంగ్` తో సంబంధాలున్నాయని... ఆయన ఫామ్‌హౌస్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ (పిల్లల అక్రమ రవాణా) జరుగుతోందని.. అంతేకాకుండా చనిపోయిన సినీ నటుల శవాలను ఆ ఫామ్‌హౌస్‌లోనే పూడ్చిపెడుతున్నారంటూ కేతన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఆస్తి వివాదాన్ని పక్కనబెట్టి సల్మాన్ మతపరమైన గుర్తింపును వాడుకుంటూ కమ్యూనల్ సెంటిమెంట్లను రెచ్చగొట్టేలా ఈ పోస్టులు ఉన్నాయని సల్మాన్ న్యాయవాది వాదించారు.

ప్ర‌త్య‌ర్థి ఆరోపణలను సల్మాన్ ఖాన్ లాయర్ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఈ ఆరోపణలన్నీ కేవలం ప్రతివాది ఊహ‌లు, కల్పనలు మాత్రమే. ఒక సాధారణ ఆస్తి వివాదంలో నా వ్యక్తిగత ప్రతిష్టను ఎందుకు దిగజారుస్తున్నారు? ఇందులోకి మతాన్ని ఎందుకు లాగుతున్నారు? నా తల్లి హిందూ, నా తండ్రి ముస్లిం, నా సోదరులు హిందూ అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. మేము ఇంట్లో అన్ని పండుగలను సమానంగా జరుపుకుంటాము! అని సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేతన్ కక్కడ్ స్పందిస్తూ.. సల్మాన్ ఖాన్ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని.. తన ఆస్తికి వెళ్లే దారిని బ్లాక్ చేశారని.. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపారు. స‌ల్మాన్ ప్ర‌స్తుతం త‌న `మాతృభూమి` సినిమాని రిలీజ్ చేసేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలోను సల్మాన్ నటిస్తున్నారు.

Tags:    

Similar News