సౌత్ లో బాలీవుడ్ విలన్లు అందుకేనా?
భారతీయ సినిమా రంగంలో భాషా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ వంటి దక్షిణాది పరిశ్రమలు నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరోలను విలన్లుగా తీసుకోవడం బలమైన ట్రెండ్‌గా మారింది.;
భారతీయ సినిమా రంగంలో భాషా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ వంటి దక్షిణాది పరిశ్రమలు నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరోలను విలన్లుగా తీసుకోవడం బలమైన ట్రెండ్‌గా మారింది. స్టార్ హీరో చిత్రంలో విలన్ గా నటించాలంటే? అది బాలీవుడ్ నటుడు మాత్రమే అయి ఉండాలి? అన్నంత స్ట్రాంగ్ గా సన్నివేశం మారిపోయింది. హిందీ నుంచి పేరున్న నటుడైనా అయి ఉండాలి. లేదా పెద్ద స్టార్ అయినా విలన్ గా నటించాలి అన్నంత సీన్ మారిపోయింది. తెలుగులో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలు కూడా ఇదే విధానాన్ని ఈ మధ్య కాలంలో అనుసురిస్తున్నాయి.
ఈ ఎంపికల వెనుక వ్యాపార కోణం మాత్రమే ఉందా? లేక సినిమా నాణ్యతను పెంచే సృజనాత్మక ఉద్దేశం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక బాలీవుడ్ స్టార్‌ను విలన్‌గా తీసుకోవడం వెనుక ప్రధాన కారణం మార్కెట్ విస్తరణ. దక్షిణాది సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులకు చేరువవ్వాలంటే? అక్కడ సుపరిచితులైన ముఖాలు ఉండటం కలిసొచ్చే అంశం. ఒక పెద్ద బాలీవుడ్ హీరో విలన్‌గా నటించడం వల్ల హిందీ బెల్ట్‌లో సినిమాకు లభించే ఓపెనింగ్స్, డిజిటల్ రైట్స్ విలువ అమాంతం పెరుగుతాయి. ఇది ఒక రకంగా సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపును, భారీ పబ్లిసిటీని తెచ్చిపెట్టే వ్యూహాత్మక అడుగని చెప్పొచ్చు.
అలాగని పూర్తిగా దీనిని కేవలం మార్కెటింగ్ తంతూగా మాత్రమే చూడలేం. విభిన్న శైలి నటుల కలయిక వల్ల సినిమా కంటెంట్ నాణ్యత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. బాలీవుడ్ నటులు అనుసరించే నటన శైలి, దక్షిణాది హీరోల మాస్ అప్పీల్ కలిసినప్పుడు తెరపై ఒక రకమైన ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. సంజయ్ దత్ , సైఫ్ అలీ ఖాన్ వంటి నటులు తమదైన గంభీరమైన నటనతో దక్షిణాది యాక్షన్ చిత్రాలకు కొత్త హుందాతనాన్ని తీసుకురాగల నటులు . మరో కోణంలో చూస్తే విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది.
ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులు విలన్ పాత్రలను కేవలం కొట్టించుకోవడానికే కాకుండా? హీరోకి సమవుజ్జీగా తీర్చిదిద్దుతున్నారు. అటువంటి పవర్‌ఫుల్ పాత్రలకు బాలీవుడ్ స్టార్స్ తోడైతే వారి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలోని సంఘర్షణను మరింత రక్తికట్టిస్తుంది. ఇది కథలో డ్రామాను పండించడమే కాక ప్రేక్షకు లకు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. అయితే ఈ ధోరణి వల్ల ఒక చిన్న ప్రమాదం కూడా ఉంది. కేవలం స్టార్‌డమ్ కోసమే బాలీవుడ్ నటులను తీసుకొని వారి పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోతే అది సినిమాకు భారంగా మారుతుంది.
కథలో సహజత్వం లోపించి కేవలం కాంబినేషన్ కోసమే తీసినట్లు అనిపిస్తే ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి సృజనాత్మక అవసరానికి - వ్యాపార అవసరానికి మధ్య సరైన సమతుల్యత పాటించినప్పుడే ఇటువంటి కలయికలు అద్భుతాలను సృష్టిస్తాయన్నది గుర్తించాలి.