బాప్‌రే! కోట్లకు కోట్లు లాట్లు కొల్లగొడుతున్న స్టార్లు!!
ముంబై బాంద్రా, అంథేరి, చెంబూర్, నవీ ముంబై, బోరివలీ, థానే, గురుగ్రామ్ ఇలా ప్రతిచోటా బాలీవుడ్ టాప్ స్టార్లు పెట్టుబడులు పెట్టి వందల కోట్లు సంపాదిస్తున్నారు;
కోటి పెట్టుబడి పెడితే, 2-3 ఏళ్లకే రూ.2-3 కోట్లు కొల్లగొడుతున్నారు. రెండేళ్లలో డబ్బుకు డబ్బు వచ్చే స్కీమ్ ఇంకేదైనా ఉందా? 10ఏళ్లు ఎదురు చూసినా బ్యాంక్ వడ్డీ అసలుకు అసలు అంత రాదు. కానీ ముంబైలోని ఏదైనా ప్రైమ్ ఏరియాలో అపార్ట్ మెంట్ లేదా ఇల్లు కొనుగోలు చేసి 200 రెట్లు సంపాదించడం చాలా సులువు. అది కూడా కేవలం నాలుగేళ్లకే అంత పెద్ద మొత్తం ఆర్జిస్తున్న మహానుభావులు ముంబైలో ఉన్నారు. సెలబ్రిటీలు తమ పారితోషికాల్ని, ఆదాయాల్ని ముంబైలోని పలు ఏరియాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలివిగా ఆర్జిస్తున్నారు. నగరాన్ని ఆనుకుని ఎదుగుతున్న సబర్బన్ ఏరియాలో భారీగా భూములు కొని వందల కోట్ల వ్యాపారాల్ని విస్తరించిన ప్రముఖులు ఉన్నారు. ముంబై బాంద్రా, అంథేరి, చెంబూర్, నవీ ముంబై, బోరివలీ, థానే, గురుగ్రామ్ ఇలా ప్రతిచోటా బాలీవుడ్ టాప్ స్టార్లు పెట్టుబడులు పెట్టి వందల కోట్లు సంపాదిస్తున్నారు.
ముంబైలో రియల్ వ్యాపారంలో సంపాదిస్తున్న స్టార్ల ఆదాయాలు.. ఒక సగటు టాలీవుడ్ స్టార్ హీరో సంపాదించే పారితోషికాల కంటే చాలా పెద్ద మొత్తం అని ప్రూవైంది. ఒక స్టార్ హీరో తన సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. ఈ ఏడాదిలో రవితేజ లాంటి స్టార్ హీరో 10 కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ అదే 10 కోట్లు ముంబైలోని ప్రైమ్ ఏరియా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి తెలివిగా 20 కోట్లు సంపాదిస్తున్న హిందీ స్టార్లు ఉన్నారు.
తెలివైన పెట్టుబడులతో హిందీ స్టార్లు నిరంతరం గొప్ప లాభాల్ని ఆర్జిస్తున్నారు. బచ్చన్‌లు, ఖాన్‌లు, ఒబెరాయ్ లు, కపూర్స్, దేవగన్స్ సహా చాలామంది తెలివితేటలతోనే భారీ రియల్ వ్యాపారం చేస్తున్నారు. తమ ఆదాయాల్ని కళ్లు చెదిరే రియల్ వెంచర్లలో పెట్టుబడులుగా పెట్టి కేవలం మూడు నాలుగేళ్లకే రీసేల్ ద్వారా ఊహించని లాభాల్ని అందుకుంటున్నారు. కొందరైతే రెంట్లు, లీజులకు ఆస్తులను ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తాల్ని ఖాతాలో వేసుకుంటున్నారు.
అమితాబ్ నాలుగేళ్లకే తన అపార్ట్ మెంట్ అమ్మకం ద్వారా 50 కోట్లు లాభం పొందాడని కథనాలొచ్చాయి. 180 శాతం లాభంతో కళ్లు భైర్లుకమ్మే పెట్టుబడిని పరిచయం చేసాడు. అజయ్ దేవగన్ ఇటీవలే తన ఫ్లాట్లపై 10కోట్లు ఆర్జించాడని కథనాలొచ్చాయి.. అది కూడా కేవలం ఐదేళ్లలోనే. పలువురు కథానాయికలు తమ ఫ్లాట్ లను భారీ లాభాలకు అమ్ముకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ తన ఇంటిపై ఐదేళ్లలో 10 కోట్లు రెంట్ అందుకుంటున్నాడు. 3 కోట్లకు ఫ్లాట్ కొని.. ఐదేళ్ల రెంటు రూపంలో 10 కోట్లు దండుకోవడం అంటే మాటలా? కేవలం 3 కోట్లకు ఫ్లాట్ కొని.. ఐదేళ్లకు రెంటు 10 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇలాంటి తెలివైన పెట్టుబడులతో బాలీవుడ్ స్టార్లు కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే ఈ తరహా రియల్ వ్యాపారంలో తెలుగు స్టార్లు వెనకబడినట్టే కనిపిస్తోంది. లేదా టాలీవుడ్ స్టార్ల రియల్ వెంచర్లు, పెట్టుబడులపై తెలుగు మీడియా అంతగా ఫోకస్ చేయకపోవడం వల్ల కూడా వివరాలేవీ తెలియడం లేదని భావించాలి.