బిడ్డను కన్న తర్వాత.. ఇకనైనా మా కోసం.. నటీమణుల భావోద్వేగం!
కెరీర్, గ్లామర్, బాధ్యతల మధ్య నలిగిపోయే మహిళలకు తమ జీవితాలను తాము ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో ఈ `బాలీవుడ్ మామ్స్` చాటిచెబుతున్నారు.;
వెండితెరపై గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోయే నటీమణులు సైతం మాతృత్వ ప్రయాణంలో సామాన్య మహిళల తరహాలోనే అనేక భావోద్వేగ సంఘర్షణలకు లోనవుతుంటారు. కేవలం కియారా అద్వానీ మాత్రమే కాదు.. సమీరా రెడ్డి నుండి దీపికా పదుకొనే వరకు అనేకమంది తారలు తమ మాతృత్వ అనుభవాలను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితమంతా ఇతరుల కోసమే ఆలోచిస్తూ గడిపిన తాము, బిడ్డ పుట్టిన తర్వాతే తమతో తమకున్న బంధం విలువ ఏమిటో తెలుసుకున్నామని వీరంతా ఒకే గొంతుకతో చెబుతున్నారు. కెరీర్, గ్లామర్, బాధ్యతల మధ్య నలిగిపోయే మహిళలకు తమ జీవితాలను తాము ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో ఈ `బాలీవుడ్ మామ్స్` చాటిచెబుతున్నారు.
సమీరా రెడ్డి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే వంటి తారలు మాతృత్వంలో ఎదురయ్యే శారీరక, మానసిక సవాళ్లను ధైర్యంగా ప్రపంచానికి చాటారు. సమీరా రెడ్డి తన మొదటి ప్రసవం తర్వాత ఎదుర్కొన్న `పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్` (ప్రసవానంతర ఒత్తిడి) .. పెరిగిన బరువుపై వచ్చిన విమర్శలను స్ఫూర్తిదాయకంగా ఎదుర్కొన్నారు. ఇటీవల తల్లి అయిన దీపికా, గర్భధారణ సమయంలో కత్రినా సైతం మాతృత్వం అనేది కేవలం అద్భుతమైన అనుభూతి మాత్రమే కాదని, అది మహిళల్లో ఒక రకమైన భావోద్వేగ యుద్ధాన్ని .. బాధ్యతాయుతమైన ఒత్తిడిని కలిగిస్తుందని నిజాయితీగా అంగీకరించారు.
కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు మాతృత్వానికి ప్రాధాన్యతనివ్వడం అనేది ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, ఆలియా భట్ వంటి వారి జీవితాల్లో ఒక పెద్ద మలుపు. సరోగసీ ద్వారా తల్లి అయిన ప్రియాంక.. తన బిడ్డ వంద రోజుల పాటు ఎన్.ఐ.సి.యులో ఉన్నప్పుడు తను అనుభవించిన నరకాన్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుష్క -ఆలియా సైతం బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణం తమ జీవిత ప్రాధాన్యతలను పూర్తిగా మార్చివేసిందని వెల్లడించారు. వృత్తిపరమైన విజయాల కంటే మాతృత్వం ఇచ్చే ఆ సంతృప్తి వెలకట్టలేనిదని వారు నిరూపించారు.
భావోద్వేగంతో కియరా కన్నీళ్లు..
కియారా అద్వానీ తాజాగా తన అనుభవాలను షేర్ చేస్తూ.. తల్లి కావడం అనేది ఒక మహిళ జీవితంలో అతిపెద్ద ఐడెంటిటీ షిఫ్ట్ అని పేర్కొన్నారు. తన 34 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ ఇతరుల కోసమే ఆలోచించేదానినని.. కానీ తన కుమార్తె సారాయా మల్హోత్రా జన్మించిన తర్వాతే తన కోసం తాను సమయం కేటాయించుకోవడం నేర్చుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసవానంతర పరిస్థితుల గురించి సమాజంలో సరైన చర్చ జరగడం లేదని.. ఆ సమయంలో ఒక మహిళ తనను తాను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని కియరా చేసిన వ్యాఖ్యలు ప్రతి తల్లి హృదయాన్ని స్పృశిస్తున్నాయి.
ప్రస్తుతం కియారా అద్వానీ మాతృత్వ బాధ్యతలను నిర్వహిస్తూనే.. వృత్తిపరంగా `టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్` వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పిరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పీసీ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఎంత బిజీగా ఉన్నా.. తనకు తానుగా సమయం కేటాయించుకుని మానసిక ప్రశాంతతను వెతుక్కోవడం జీవితంలో తాను చేసిన అత్యంత ఉత్తమమైన పని అని కియరా చెప్పడం.. మహిళలందరికీ ఒక కొత్త సందేశాన్ని ఇస్తోంది.