సీనియర్ హీరోల డైలమా పెద్ద ప్రాబ్లమే!
బాలీవుడ్ వెండితెరను దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఖాన్ త్రయం షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్.;
బాలీవుడ్ వెండితెరను దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఖాన్ త్రయం షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్.ప్రస్తుతం ఈ ముగ్గురు అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వీరి పేరు చెబితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసేది. కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల దృష్ట్యా ఇప్పుడు సరైన జానర్‌ను ఎంచుకోవడంలో తీవ్రమైన డైలమాలో పడుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ లేదా లాంగ్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల బాలీవుడ్‌లో ఖాన్ల శకం ముగిసిందా? అన్న చర్చా లేకపోలేదు.
షారుఖ్ ఖాన్ విషయానికొస్తే పఠాన్, జవాన్ వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నప్పటికీ, ఆ తర్వాత మళ్లీ తనదైన మార్క్ కథలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా పరాజయం తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నారు. కంటెంట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే అమీర్ సైతం ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ఏ కథతో రావాలో? తెలియక సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. వీరిద్దరి పరిస్థితి ఇలా ఉంటే? సల్మాన్ ఖాన్ తన రెగ్యులర్ మాస్ ఫార్ములా చిత్రాలతో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం ప్రేక్షకులు కేవలం స్టార్ ఇమేజ్‌ను చూసి థియేటర్లకు రావడం లేదు. సౌత్ ఇండియా నుంచి రిలీజ్ అయిన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు బాలీవుడ్ మార్కెట్‌ను శాషించడంతో? ఖాన్ హీరోలకు గట్టి పోటీ ఎదురవుతోంది. పాన్-ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ డ్రామాలు లేదా వెరైటీ కాన్సెప్ట్‌లు ఉంటేనే జనాలు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో పాతకాలపు రొమాంటిక్ , రొటీన్ మాస్ కథలనే నమ్ముకోవడం వల్ల వీరి మార్కెట్ దెబ్బతింటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరుసగా ఎదురవుతోన్న పరాజయాలు , సినిమాల మధ్య పెరిగిన గ్యాప్ కారణంగా బాలీవుడ్ జనాలు కొత్త తరం హీరోల వైపు మొగ్గు చూపుతున్నారు. రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి యువ హీరోలు వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతుండటంతో సీనియర్ల హవా తగ్గుతోందనేది వాస్తవం. 50 ఏళ్లు పైబడిన ఈ హీరోలు ఇంకా యువకుల్లాగే రొమాంటిక్ పాత్రలు చేయడం కంటే? తమ వయసుకు తగ్గట్టుగా అమితాబ్ బచ్చన్ తరహాలో పవర్‌ఫుల్ క్యారెక్టర్ రోల్స్ లేదా సీరియస్ డ్రామాల వైపు వెళ్లాలని సోషల్ మీడియాలో కామెంట్స్ లేకపోలేదు.
అయితే వీరి శకం ముగిసిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. ఎందుకంటే ఖాన్ హీరోలకు ఉన్న ఫ్యాన్ బేస్ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఒక్క సరైన హిట్ పడితే మళ్లీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగల సత్తా వీరికి ఉంది. ప్రస్తుతం వీరు ఎదుర్కొంటున్న ఈ డైలమా కేవలం తాత్కాలికమే. సరైన దర్శకుడు బలమైన కథ దొరికితే మళ్లీ విశ్వరూపం చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఖాన్ త్రయం తమ ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే ప్రస్తుత పాన్-ఇండియా ట్రెండ్‌ను అర్థం చేసుకుని ముందుకు సాగాలి. కంటెంట్ పరంగా రాజీ పడకుండా, కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తేనే వారు మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఖాన్ల గర్జన వినిపించాలంటే? వారు తమ పాత ఫార్ములాలను వీడి కొత్త బాట పట్టక తప్పదు. మరి రాబోయే రోజుల్లో వీరు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.