బాలీవుడ్‌ ఆశలన్నీ ఎన్టీఆర్‌ మూవీపైనే..!

గత ఐదేళ్ల కాలంలో బాలీవుడ్‌ తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. కరోనా సమయంలో బాలీవుడ్‌ సినిమాలు ఓటీటీ డైరెక్ట్‌ రిలీజ్ అయ్యాయి.;

Update: 2025-06-30 11:30 GMT

గత ఐదేళ్ల కాలంలో బాలీవుడ్‌ తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. కరోనా సమయంలో బాలీవుడ్‌ సినిమాలు ఓటీటీ డైరెక్ట్‌ రిలీజ్ అయ్యాయి. ఆ సమయంలో ఓటీటీకి అలవాటు పడ్డ ఉత్తరాది ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు తిరిగి చూసే పరిస్థితి కనిపించడం లేదు. సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ విధంగా చూసుకున్నా కూడా బాలీవుడ్‌లో సినిమాలు ఆడటం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో బాలీవుడ్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన సినిమాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. స్టార్‌ హీరోల సినిమాలు కూడా కుప్పకూలుతున్నాయి. ఒకప్పుడు మినిమం వంద కోట్లు సాధించిన హీరోలు పాతిక కోట్లు రాబట్టడానికి కిందా మీదా పడుతున్నారు.

ఏడాది మొత్తంలో అర డజను సినిమాలు ఆడుతున్నాయి. కొన్ని యావరేజ్ టాక్‌ దక్కించుకున్నా వాటికి కలెక్షన్స్ అంతంత మాత్రమే. 2024, అంతకు ముందు సంవత్సరాలతో పోల్చితే 2025 కాస్త ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది ప్రథమార్థంలో మంచి బిజినెస్ జరిగింది. ఎప్పటిలాగే కొన్ని సినిమాలు తీవ్రంగా నిరాశ పరచినప్పటికీ కొన్ని సినిమాలు మంచి వసూళ్లు నమోదు చేశాయి. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మల్టీప్లెక్స్‌తో పాటు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో సినిమాలు ఆడుతున్నాయి. జూన్ వరకు బాలీవుడ్‌ మంచి ఫలితాన్ని చవిచూసింది. ఇక రాబోయే అర్ధ సంవత్సరం ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.

2025 సెకండ్‌ హాఫ్‌లో విడుదల కాబోతున్న పెద్ద సినిమాల్లో 'వార్‌ 2' ఒకటి. హృతిక్‌ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన వార్‌ 2 సినిమాను ఆగస్టు 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్‌తో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటి వరకు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్ అన్నింటిలోకి ఈ సినిమా అత్యంత ఖరీదైన సినిమాగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

బాలీవుడ్‌లో 2025 సెకండ్‌ హాఫ్‌లో మరిన్ని సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుంటాయనే విశ్వాసంతో హిందీ ఫిల్మ్ మేకర్స్‌ ఉన్నారు. బాలీవుడ్‌ మెల్ల మెల్లగా పుంజుకుంటుందని, వార్‌ 2 వంటి స్పై థ్రిల్లర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తే కచ్చితంగా ముందు ముందు మరిన్ని విజయాలు నమోదు అయ్యే అవకాశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు ముందు ముందు ఇండస్ట్రీ మనుగడకు కీలకంగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వార్‌ 2 సూపర్‌ హిట్‌ అయితే కచ్చితంగా బాలీవుడ్‌ ఊపిరి పీల్చుకోవచ్చు. అందుకే వార్‌ 2 పై బాలీవుడ్‌ ఆశలు పెట్టుకుని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News