హాస్య‌ న‌ట‌ చక్రవర్తి డేవిడ్ ధావన్ రిటైర్మెంట్!

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించి సరికొత్త హాస్య శైలికి ప్రాణం పోసిన దిగ్గజ దర్శకుడు డేవిడ్ ధావన్ సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు.

Update: 2026-05-25 03:28 GMT

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించి సరికొత్త హాస్య శైలికి ప్రాణం పోసిన దిగ్గజ దర్శకుడు డేవిడ్ ధావన్ సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. తన కుమారుడు వరుణ్ ధావన్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న `హై జవానీ తో ఇష్క్ హోనా హై` చిత్రమే దర్శకుడిగా తన ఆఖరి సినిమా కానుందని ఆయన ప్రకటించారు. ఈ వార్త బాలీవుడ్ చిత్రసీమతో పాటు మిలియన్ల కొద్దీ సినిమా అభిమానులను ఆశ్చర్యానికి, కొంత నిరాశకు గురిచేసింది.

ఇటీవల ముంబైలో పీవీఆర్ ఐనాక్స్ ఆధ్వర్యంలో డేవిడ్ ధావన్ ఘనమైన సినీ ప్రస్థానాన్ని గౌరవిస్తూ `డేవిడ్ ధావన్ ఫిల్మ్ ఫెస్టివల్` పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు డేవిడ్ ధావన్‌తో పాటు ఆయన కుమారుడు, నటుడు వరుణ్ ధావన్ , ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహార్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలోనే డేవిడ్ ధావన్ ఇకపై సినిమాలకు దర్శకత్వం వహించబోనని, రిటైర్ కాబోతున్నానని కరణ్‌తో పంచుకున్నారు. ఈ ప్రకటన విన్న వెంటనే కరణ్ జోహార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను పెట్టారు. `నిన్న నేను డేవిడ్ జీ వేడుకకు వెళ్లినప్పుడు ఇది తన చివరి చిత్రమని ఆయన నాతో చెప్పారు. ఆ మాట వినగానే నా హృదయంలో ఓ రకమైన అనుభూతి కలిగింది. భారతీయ సినిమాలో ఓ సరికొత్త శైలిని సృష్టించిన గొప్ప దర్శకుడు ఆయన. బాలీవుడ్‌లో డేవిడ్ ధావన్ సినిమా అంటేనే స్వచ్ఛమైన వినోదానికి మారుపేరు. అలాంటి వ్యక్తి ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఆయన మనసు ఎంత భారంగా ఉండి ఉంటుందో ఊహించలేము` అంటూ కరణ్ రాసుకొచ్చారు.

సినీ పరిశ్రమకు డేవిడ్ ధావన్ ఓ గొప్ప విద్యాసంస్థ లాంటివారని, ఎంతో మంది యువ దర్శకులకు ఆయన నిరం తర స్ఫూర్తి అని కరణ్ కొనియాడారు. బాలీవుడ్ మొత్తం ఆయనను ఎల్లప్పుడూ ప్రేమిస్తుందని, గౌరవిస్తుందని పేర్కొన్నారు. డేవిడ్ ధావన్ శైలిలో మ‌రెవ్వ‌రు సినిమాలు చేయ‌లేర‌న్నారు. వరుణ్ ధావన్‌తో కలిసి ఆయన తీస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని ఆకాంక్షించారు. డేవిడ్ ధావన్ నంబర్ వన్ మ్యాన్... ఎల్లప్పుడూ ఆయనే నంబర్ వన్ అంటూ కరణ్ జోహార్ తన పోస్ట్‌లో గౌరవంగా ముగించారు.

గడిచిన 43 సంవత్సరాలకు పైగా సాగిన డేవిడ్ ధావన్ సినీ ప్రస్థానం ఎంతో అద్భుతమైన విజయాలతో సాగింది. అందుకే ఆయనను బాలీవుడ్ `కింగ్ ఆఫ్ కామెడీ` అని పిలుస్తుంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, గోవిందా, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ వంటి అగ్ర హీరోల నుండి నేటి తరం నటీనటుల వరకు ఎందరో ఆయన దర్శకత్వంలో పనిచేశారు. అమితాబ్-గోవిందా (బడే మియాన్ ఛోటే మియాన్), సంజయ్ దత్-గోవిందా (హసీనా మాన్ జాయేగీ), అక్షయ్ కుమార్-సల్మాన్ ఖాన్ (ముజ్సే షాదీ కరోగి) వంటి ఐకానిక్ ఆన్-స్క్రీన్ కాంబినేషన్లను సృష్టించిన ఘనత కూడా డేవిడ్ ధావన్‌కే దక్కుతుంది.

దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత డేవిడ్ ధావన్ మళ్లీ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న చిత్రం `హై జవానీ తో ఇష్క్ హోనా హై. తండ్రీకొడుకుల కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమాలో వరుణ్ ధావన్‌తో పాటు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమేష్ తౌరానీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఈ ఏడాది జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News