ట్రెండీ టాక్: దురంధర్ 2-భూత్ బంగ్లా తర్వాత మ‌ళ్లీ చాప చుట్టేసారు!

ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన వైఫ‌ల్యాలు ఎదుర‌వుతున్నాయి. ఇటీవలే విడుదలైన `దురంధర్ 2`, `భూత్ బంగ్లా` వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించి ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోశాయి.

Update: 2026-05-19 17:34 GMT

ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన వైఫ‌ల్యాలు ఎదుర‌వుతున్నాయి. ఇటీవలే విడుదలైన `దురంధర్ 2`, `భూత్ బంగ్లా` వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించి ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోశాయి. ముఖ్యంగా హారర్ కామెడీ జోనర్‌లో వచ్చిన `భూత్ బంగ్లా` ఏకంగా రూ. 250 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్‌కు పెద్ద ఊరటనిచ్చింది. అలాగే వేల కోట్ల వసూళ్లతో `దురంధర్` ఫ్రాంచైజీ .. హిందీ సినిమా మునుపెన్నడూ చూడ‌ని రిజ‌ల్ట్ ని ఇచ్చింది. అయితే ఈ రెండు చిత్రాల సంచలనం ముగిసిన వెంటనే బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చాప చుట్టేస్తుండటంతో మళ్లీ ఒక పెద్ద హిట్ వచ్చే వరకు ఇండ‌స్ట్రీ ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ట్రేడ్ విశ్లేషకులు సైతం ప్రస్తుతం హిందీ మార్కెట్లో అన్నీ ఫ్లాపులే కనిపిస్తున్నాయంటూ పెదవి విరుస్తున్నారు.

ఈ బాక్సాఫీస్ సంక్షోభానికి అద్దం పడుతూ సీనియర్ స్టార్ సంజయ్ దత్ నటించిన `ఆఖరి సవాల్` చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 30 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామా తొలి మూడు రోజుల్లో కనీసం రూ. 3 కోట్లు కూడా వసూలు చేయలేక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిలబడింది. మరోవైపు వైవిధ్యమైన కథలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరొందిన ఆయుష్మాన్ ఖురానాకు సైతం ఈసారి లక్ కలిసి రాలేదు. ఆయన నటించిన `పతి పత్ని ఔర్ వో దో` చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్‌గా మిగిలింది. అందాల హీరోయిన్లు, ఆయుష్మాన్ విస్తృతంగా ప్రమోషన్లు చేసినా మిశ్రమ స్పందనలు రావడంతో ఈ సినిమా కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దాదాపు రూ. 50-60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టుబడిలో సగం కూడా రికవరీ చేయలేక బాక్సాఫీస్ రేసు నుండి త్వరగానే తప్పుకుంది.

మరో యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు అస్సలు టైమ్ కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయిన అత‌డికి తాజాగా విడుదలైన `హై జవానీ తో ఇష్క్ హోనా హై`) చిత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ సినిమాకు `ఫ్లాప్ గ్యారెంటీ` అంటూ ట్రేడ్ వర్గాలు ముద్ర వేశాయి. దాదాపు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీసం రూ. 15 కోట్ల మార్కును కూడా దాటలేక వెలవెలబోయింది. కథలో బలం లేకపోవడం.. పాత చింతకాయ పచ్చడి లాంటి కథనంతో రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్ల వైపు వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. వరుణ్ ధావన్ కెరీర్‌లో ఈ చిత్రం మరో పెద్ద మైనస్‌గా మిగిలిపోనుంది.

ఇదే తరహా ఘోర పరాజయాన్ని అగ్ర హీరో షాహిద్ కపూర్ కూడా చవిచూశారు. ఆయన లీడ్ రోల్‌లో వచ్చిన `కాక్‌టైల్ 2` బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతూ `గోల్డెన్ లెగ్`గా పేరొందిన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించినప్పటికీ ఈ సినిమాను ఆదుకోలేకపోయింది. దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. తన ఫుల్ రన్‌లో కేవలం రూ. 25 నుండి 30 కోట్ల లోపే వసూలు చేసి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. షాహిద్ కపూర్ లాంటి అగ్ర హీరో సినిమాకు కనీస ఓపెనింగ్స్ రాకపోవడం... కథనంలో సృజనాత్మకత లోపించడం వల్లే ఈ సీక్వెల్ ఘోరంగా ఫెయిలైందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఈ వరుస పరాజయాల నేపథ్యంలో బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రం `వెల్కమ్ 3` పైనే ఉన్నాయి. దాదాపు రూ. 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఇది రూపొందింది. బూత్ బంగ్లాతో ఊపిరులూదిన‌ అక్షయ్ కుమార్ ఇందులో ఒక హీరో కావ‌డంతో కొంత న‌మ్మ‌కం ఇండ‌స్ట్రీ జ‌నంలో ఉంది. సంజయ్ దత్, అర్షద్ వార్సి వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం బాలీవుడ్‌కు తదుపరి హిట్‌ను అందిస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ ఆలస్యం కావడం .. పలుమార్లు విడుదల తేదీలు మారడం వంటి అంశాలు సినిమాపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపినా కానీ..వెల్కమ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ .. కామెడీ జోనర్ కావ‌డంతో థియేటర్లలో ప్రేక్షకులను క‌చ్చితంగా అలరిస్తుందని భావిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రం భారీ అంచనాలను అందుకుని.. బాలీవుడ్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News