స్టార్ హీరో ఫోన్‌నంబర్ తీసుకుంటే అవకాశం ఇవ్వాలా?
అయితే.. ఒక నటికి బరువు తగ్గాలని ఒక స్టార్ హీరో లేదా మెంటార్ సూచించడంలో తప్పు ఏమిటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో శారీరక సౌష్టవం, ఫిట్‌నెస్ అనేవి కెరీర్ ఎదుగుదలకు అత్యంత కీలకం.
సినీ పరిశ్రమలో నటీనటుల రూపంపై వచ్చే వ్యాఖ్యలు, స్టార్ హీరోల నుంచి లభించే హామీలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. ఇటీవల భోజ్‌పురి, హిందీ టీవీ నటి సంభావనా సేథ్.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో తనకున్న పాత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో ఒక వేదికపై సల్మాన్ ఖాన్ తనను `బరువు తగ్గమని` సూచించినప్పుడు తాను తీవ్రంగా కలత చెందానని, ఆ రోజంతా ప్రయాణంలో కన్నీళ్లు పెట్టుకున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. బహిరంగంగా, నిర్మొహమాటంగా మాట్లాడే మహిళలంటే సల్మాన్‌కు పెద్దగా ఇష్టం ఉండదని కూడా సంభావన వ్యాఖ్యానించడం పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీసింది.
అయితే.. ఒక నటికి బరువు తగ్గాలని ఒక స్టార్ హీరో లేదా మెంటార్ సూచించడంలో తప్పు ఏమిటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో శారీరక సౌష్టవం, ఫిట్‌నెస్ అనేవి కెరీర్ ఎదుగుదలకు అత్యంత కీలకం. పరిశ్రమలో ఒక స్టార్ హీరో నంబర్ ఇచ్చి, నేరుగా సంప్రదించమని చెప్పినంత మాత్రాన అవకాశాలు వచ్చేస్తాయని అనుకోవడం అత్యాశే అవుతుంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ వందలాది వ్యాపకాలతో, `బీయింగ్ హ్యూమన్` వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఆయన చుట్టూ సంభావన లాంటి ఎందరో నటీమణులు అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. తన కెరీర్‌లో దాదాపు 50 నుండి 100 మంది నటీనటులకు, టెక్నీషియన్లకు సల్మాన్ లైఫ్ ఇచ్చారనేది వాస్తవం. ఇలాంటి స్థితిలో క్యాజువల్‌గా ఇచ్చిన నంబర్‌ను నమ్ముకుని.. తర్వాత ఫోన్ చేస్తేనే అవకాశాలు వచ్చేస్తాయని ఆశించి నిరాశపడటం సహేతుకం కాదని నెటిజనులు సంభావనకు సూచిస్తున్నారు.
మరోవైపు.. బహిరంగంగా మాట్లాడే ఆడవారంటే సల్మాన్‌కు ఇష్టం ఉండదన్న సంభావన వ్యాఖ్యలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ పరిశ్రమలోనే కాదు.. సమాజంలో ఎక్కడైనా సరే `బహిరంగంగా మాట్లాడటం` వేరు... పరిధులు దాటి తప్పుగా మాట్లాడటం లేదా ఇతరులను కించపరిచేలా మాట్లాడటం వేరు. ఎవరైనా సరే సందర్భం లేకుండా.. ఇతరులను తక్కువ చేస్తూ మాట్లాడితే వారిపై గౌరవం తగ్గడం సహజం. బహుశా సల్మాన్ ఖాన్ వంటి పెద్ద స్టార్స్ క్రమశిక్షణను, హుందాతనాన్ని ఆశిస్తారే తప్ప... మహిళల భావప్రకటన స్వేచ్ఛను అణచివేయాలని అనుకోరు.
ఇక సంభావనా సేథ్‌కు ఎదురైనట్లే.. గతంలో బాలీవుడ్ - టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీమణులు కూడా స్టార్ హీరోలు లేదా దర్శకుల కామెంట్ల వల్ల స్టేజీలపై లేదా సెట్స్‌లో కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో కొంతమంది సీనియర్, జూనియర్ నటీమణులు తమ బాడీ షేమింగ్ (లావుగా ఉన్నారనడం) లేదా లుక్స్ సరిగ్గా లేవని తోటి నటులు అన్నప్పుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే పరిశ్రమలో నిలదొక్కుకున్న విజయవంతమైన నటీమణులు చాలామంది ఇలాంటి కామెంట్లను నెగెటివ్‌గా తీసుకోలేదు. సహనటులు లేదా దర్శకులు బరువు తగ్గమని సలహా ఇస్తే.. దానిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, కష్టపడి తమ రూపాన్ని మార్చుకుని తిరిగి అద్భుతమైన అవకాశాలు దక్కించుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు.
సినీ రంగంలోకి వచ్చే కొత్తవారికి స్టార్ల మాటలు, సలహాలు ఒక్కోసారి నిరాశను మిగిల్చినా... వాటిని వ్యక్తిగత విమర్శలుగా తీసుకోకుండా ప్రొఫెషనల్‌గా చూడటం ముఖ్యం. పరిశ్రమలో అవకాశాలు అనేవి కేవలం పరిచయాల వల్ల మాత్రమే రావు. నిరంతర శ్రమ..కాలానికి తగ్గట్టుగా రూపాన్ని, నటనను మార్చుకునే తత్వం ఉన్నప్పుడే ఇక్కడ సుదీర్ఘకాలం కొనసాగడం సాధ్యమవుతుంది. సంభావన సైతం ఈ విషయాన్ని గ్రహించి సల్మాన్‌పై ఎలాంటి కోపం లేదని... ఇప్పటికీ ఆయనకు అభిమానినని చెప్పడం తన పరిణతిని చూపిస్తుంది.