ఎందుకు ఈ ఫ్లాపులు? సినీ దిగ్గజాల మేధోమథనం!
సల్మాన్, అక్షయ్, అమీర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి కథానాయకులు చాలా కాలంగా ఫ్లాపులతో నిరాశలో ఉన్నారు.;
హిందీ సినీపరిశ్రమలో ఇటీవల పెద్ద సినిమాలు ఫ్లాపులవ్వడం కలవరపాటుకు గురి చేస్తోంది. సల్మాన్, అక్షయ్, అమీర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి కథానాయకులు చాలా కాలంగా ఫ్లాపులతో నిరాశలో ఉన్నారు. వందల కోట్ల బడ్జెట్లతో తెరకెక్కే సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనిపిస్తోంది. అంతటా ఫిలింమేకర్స్ లో నైరాశ్యం అలుముకుంది. ఈరోజుల్లో ఎవరూ చిన్న సినిమాలు తీయడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో హిందీ చిత్రసీమలో ఒక చిన్న సినిమా మంచి టాక్ తో విజయం సొంతం చేసుకుంది. కరణ్ పాల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిన్న బడ్జెట్ సినిమా `స్టోలెన్` విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం పలు అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో పాపులరైంది. తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా స్టోలెన్ కోసం పని చేసిన క్రియేటివ్ బ్రెయిన్స్ అనురాగ్ కశ్యప్, కిరణ్ రావు, విక్రమాదిత్య మోత్వానే, నిఖిల్ అద్వాణీ వంటి ప్రముఖులు ఓ చోట సమావేశమై బెనర్జీతో పాటు, చర్చోపచర్చలు జరిపారు.
కొంత పాత తరంలో నటులు ఎలాంటి ప్రయోగాలు చేసారో ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వినోద్ ఖన్నా లాంటి నటులు ఆ రోజుల్లో కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ప్రయోగాత్మక స్వతంత్య్ర చిత్రాలతో నటులుగా సంతృప్తి చెందేవారని గుర్తు చేసుకున్నారు. సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి, విమర్శకుల ప్రశంసలు పొందిన ఫిలింమేకర్ హృషికేశ్ ముఖర్జీతో ఏడాదికో సినిమా చేయాలనే నిర్ణయం గురించి నిఖిల్ అద్వాణీ గుర్తు చేసారు. 1971లో వచ్చిన ఆనంద్ చిత్రంలో నటించడానికి రాజేష్ ఖన్నా వాస్తవానికి హృషికేశ్ ముఖర్జీని వెంబడించాడని అనురాగ్ చర్చను కొనసాగించారు. ఆరోజుల్లో నటులు అలాగే ఉండేవారు! అని ఆయన అన్నారు.
అయితే నేటి రోజుల్లో స్టార్లు భారీ బ్లాక్ బస్టర్లు, పాన్ ఇండియా హిట్లలో నటించాలని తపన పడుతున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలపై ఆసక్తిని చూపడం లేదని విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసాము.. పక్కవాళ్లతో పోలిస్తే ఎంత ఎక్కువ లాభాలు ఆర్జించాము? అనేదే ఆలోచిస్తున్నారని విశ్లేషించారు. హిందీ చిత్రసీమలో ఇలాంటి ధోరణి ఉందని అన్నారు. అయితే అమీర్ ఖాన్ కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, ప్రయోగాలకు వెనకాడలేదని కిరణ్ రావు గుర్తు చేసుకున్నారు. చర్చా సమావేశంలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాలు, కళాత్మక సినిమాల మధ్య సమతుల్యతను సాధించాలనే అమీర్ ఖాన్ ఆలోచనను గుర్తు చేసారు. అమితాబ్, దేవగన్, సైఫ్ వంటి స్టార్లు చిన్న సినిమాలతో ప్రయోగాలు చేసి పెద్ద పేరు తెచ్చుకున్నారన్న చర్చా సాగింది.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ సాధిస్తున్న భారీ పాన్ ఇండియా విజయాలను చూసి హిందీ ఫిలింమేకర్స్ భారీ బడ్జెట్ చిత్రాలకు తెర తీసారు. పాన్ ఇండియా మార్కెట్ కొల్లగొట్టాలని ఆశపడినా కానీ, అవేవీ విజయాలు సాధించలేదు. స్క్రిప్టుతో పని లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు తీసారు. ఇది బాలీవుడ్‌ని నాశనం చేసింది. అక్కడ దిగ్గజాలను పునరాలోచనలో పడేసింది.