ఆర్యన్ ఖాన్ NCB అధికారిపై ప్రతీకారం తీర్చుకున్నాడా?
అయితే తన తప్పేమీ లేదని నిరూపించుకుని ఆర్యన్ ఖాన్ ఈ కేసులో నిర్ధోషిగా బయటపడ్డాడు. అతడి తప్పేమీ లేదని కోర్టు నిర్ధారించి విడుదల చేసింది.;
కొంతకాలంగా ఆర్యన్ ఖాన్ పేరు నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కింగ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తూ `ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ సెలబ్రిటీలపై సెటైరికల్ డ్రామా కంటెంట్ తో సిరీస్ ఆద్యంతం రక్తి కట్టించాడని ఆర్యన్ పై ప్రశంసలు కురిసాయి.
అయితే ఈ సక్సెస్ ని ఆస్వాధిస్తున్న ఆర్యన్ ఖాన్ కి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ వెబ్ సిరీస్ లో ఆర్యన్ ఖాన్ ఉద్ధేశపూర్వకంగా నార్కోటిక్స్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేసాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో క్రూయిజ్ షిప్ పై దాడిలో షారూఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ ని సమీర్ వాంఖడే అనే అధికారి అరెస్ట్ చేసారు. ఆర్యన్ డ్రగ్స్ సేవించాడని, డ్రగ్స్ సిండికేట్ తో కలిసి ఉన్నాడని అతడు ఆరోపించాడు.
అయితే తన తప్పేమీ లేదని నిరూపించుకుని ఆర్యన్ ఖాన్ ఈ కేసులో నిర్ధోషిగా బయటపడ్డాడు. అతడి తప్పేమీ లేదని కోర్టు నిర్ధారించి విడుదల చేసింది. అతడు తనపై పడిన మచ్చను చెరిపేసుకున్న తర్వాత ది బా**డ్స్ఆ ఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ పై దృష్టి సారించాడు. ఈ సిరీస్ ని సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ లో షారూఖ్ స్వయంగా నిర్మించారు.
అయితే ఈ సిరీస్ లో తనను కించపరిచే పాత్రను ఆర్యన్ ఖాన్ ప్రదర్శించారని సమీర్ వాంఖడే ఆరోపించారు. తనకు జరిగిన నష్టానికి రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ సిరీస్ ని శాశ్వతంగా నిలిపివేయాలని, నిషేధం విధించాలని అతడు ఆరోపిస్తున్నాడు. తనకు దక్కే పరిహారాన్ని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో క్యాన్సర్ చికిత్స కోసం విరాళంగా ఇస్తానని చెప్పాడు. ఈ సిరీస్ లో కొన్ని దృశ్యాలు తాను స్వయంగా దాడి చేసిన క్రూయిజ్ పార్టీ ని ఎలివేట్ చేసాయని, అది ఆర్యన్ అరెస్ట్ అయినప్పటి నిజ జీవిత ఘటనలా కనిపిస్తోందని సమీర్ వాంఖడే అన్నారు. దురుద్ధేశంతో పరువు నష్టం కలిగించేలా పక్షపాతంతో దీనిని రూపొందించారని కూడా వాంఖడే విమర్శించారు. దేశంలోని మాదక ద్రవ్యాలను కంట్రోల్ చేసే ఎన్సీబీ అధికారుల ప్రతిష్ఠను దెబ్బ తీసే ప్రయత్నమిదని కూడా అన్నారు. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఒక సన్నివేశంలో అధికారి పాత్రధారి `సత్యమేవ జయతే` అనే జాతీయ నినాదాన్ని విన్నవిస్తున్నా కానీ వెంటనే అసభ్యకరమైన సిగ్నల్ ఇస్తుందని వాంఖడే విమర్శించారు. ఇది జాతీయతకు సంబంధించిన వ్యవహారమని వాదిస్తున్నారు.
భారత జాతి గౌరవ నినాదాన్ని అవమానించడమే కాకుండా, ఇది 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం (IPA)ని ఉల్లంఘించడమేనని వాంఖడే తన వాదనలో పేర్కొన్నారు. ఇది కేవలం పరువు నష్టం మాత్రమే కాదు.. జాతీయ భావాలను కూడా దెబ్బతీసేలా ఉంది. ఈ వెబ్ సిరీస్ లో భారత శిక్షాస్మృతిని విస్మరించడంతో పాటు సమాచార సాంకేతిక చట్టాలను ఉల్లంఘించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.