తండ్రితో అనుబంధం.. భార్యతో గొడవలు: బాబీ డియోల్ ఎమోషనల్ లైఫ్ స్టోరి!

యానిమ‌ల్ సినిమాలో అబ్రార్ గా క్రూర‌మైన న‌ట‌న‌తో అంద‌రి దృష్టిని త‌న‌వైపున‌కు తిప్పుకున్నాడు బాబి డియోల్.

Update: 2026-06-05 00:30 GMT

యానిమ‌ల్ సినిమాలో అబ్రార్ గా క్రూర‌మైన న‌ట‌న‌తో అంద‌రి దృష్టిని త‌న‌వైపున‌కు తిప్పుకున్నాడు బాబి డియోల్. బాలీవుడ్ ని ఏలిన డియోల్ ఫ్యామిలీ న‌ట‌వార‌సుడిగా సినీఆరంగేట్రం చేసాడు. అయితే కొంత జ‌ర్నీ త‌ర్వాత‌ కొన్నేళ్ల పాటు ఫ్లాపుల కార‌ణంగా అవ‌కాశాల్లేక అల్లాడిపోయాడు. చాలా గ్యాప్ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన అవ‌కాశం కార‌ణంగా కంబ్యాక్ అయ్యాడు. `యానిమ‌ల్` స‌క్సెస్ అనంత‌రం అత‌డు వేదిక‌ల‌పై త‌న క‌ష్టం గురించి ఓపెన్ గా చెప్పడం మొద‌లు పెట్టాడు. ఏదీ దాచుకోకుండా బ‌హిరంగంగానే ఎమోష‌న్ కి గుర‌య్యాడు.

ఇప్పుడు కూడా బాబీ ఏదీ దాచుకోవ‌డం లేదు. త‌న భార్యతో వ‌చ్చిన కొన్ని గొడ‌వ‌ల గురించి కూడా మాట్లాడాడు. ఇటీవల `ఆప్ కీ అదాలత్` టాక్ షోలో పాల్గొని తన తండ్రి, లెజెండరీ నటుడు ధర్మేంద్రతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయిన బాబి చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన తండ్రి ముద్దుగా పిలుచుకునే `కద్దూ` అనే నిక్ నేమ్ వెనుక ఉన్న కథను వెల్లడించారు. చిన్నప్పుడు తాను బొద్దుగా గుండ్రటి బుగ్గలతో ఉండేవాడినని.. ఒకసారి ఫామ్‌లో పెద్ద గుండ్రటి కూరగాయను చూసి తండ్రిని అది ఏంటని అడగ్గా ఆయన `కద్దూ` అని సమాధానమిచ్చారని చెప్పారు. నాటి నుండి ధర్మేంద్ర తనను ఆ పేరుతోనే ఎంతో ప్రేమగా పిలవడం ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.

తన చిన్నతనంలో తల్లిదండ్రులతో గడిపిన క్షణాలను వివరిస్తూ.. తాను 14 ఏళ్ల వయసు వచ్చే వరకు తన తల్లిదండ్రుల గదిలోనే ముఖ్యంగా తండ్రి పక్కనే పడుకునేవాడినని బాబీ తెలిపారు. ఆ రోజుల్లో ధర్మేంద్ర రోజుకు మూడు నాలుగు షిఫ్టులు పనిచేస్తూ అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవారని.. ఆయన కోసం తాను రాత్రిపూట ఎదురుచూసేవాడినని చెప్పారు. తనకు ఒంట్లో బాగోలేనప్పుడు తండ్రి తనను గుండెలకు హత్తుకుని పడుకునేవారని ఆ సమయంలో లభించిన ఓదార్పు, రక్షణ తన జీవితంలో మరువలేనివని ఎమోషనల్ అయ్యారు. అయితే తండ్రి పక్కన 14 ఏళ్ల పాటు పడుకోవడం వల్ల ఆయనకు ఒక వింత అలవాటు వ‌చ్చింది.

ధర్మేంద్రకు పడుకునేటప్పుడు గదిలో చిన్న వెలుతురు ఉండటం అలవాటు. తండ్రి పక్కనే పెరగడం వల్ల బాబీ డియోల్‌కు కూడా అదే అలవాటుగా మారింది. ఈ అలవాటు కారణంగా వివాహం జరిగిన కొత్తలో తన భార్యతో చిన్నపాటి గొడవలు, వాదోపవాదాలు జరిగాయని బాబీ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. బెడ్‌రూమ్‌లో చిన్న లైట్ ఆన్ చేసి పడుకోవడానికి తన భార్య మొదట్లో ఒప్పుకునేది కాదని... కానీ కాలక్రమేణా త‌ను కూడా దీనికే అలవాటు పడిపోయిందని వెల్లడించారు.

చిన్నప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా సురక్షితమైన వాతావరణంలో పెరిగినా నటుడిని కావాలనే కోరిక చిన్నప్పుడే బలంగా నాటుకుందని బాబీ డియోల్ చెప్పారు. ఓసారి నా క్లాస్ లో టీచ‌ర్ ఏం అవుతావు? అని ప్ర‌శ్నిస్తే దానికి `హీరో` అని స‌మాధాన‌మిచ్చాను. నాన్న‌తో క‌లిసి షూటింగుల‌కు వెళ్ల‌డం వ‌ల్ల ఆయ‌న‌పై ప్ర‌జ‌ల‌కు ఉండే ప్రేమాభిమానాలే తనను ఎలాగైనా హీరో కావాలనేలా ప్రేరేపించాయని.. ప్రేక్షకుల నుండి అలాంటి ప్రేమను తాను కూడా పొందాలని ఆశపడ్డానని వివరించారు.

సినిమాల్లో తన ప్రస్థానం తండ్రితోనే ప్రారంభమై తండ్రితోనే ముగిసిందని బాబీ డియోల్ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. 1977లో వచ్చిన `ధరమ్ వీర్` సినిమాలో ధర్మేంద్ర చిన్ననాటి పాత్ర పోషించడం ద్వారానే బాలనటుడిగా బాబీ కెరీర్ ప్రారంభమైంది. ఆ షూటింగ్ ముగిశాక రెమ్యునరేషన్ అడగ్గా.. ధర్మేంద్ర తన బ్యాగ్ నుండి 10,000 కట్టను తీసి దానిని నానమ్మకు ఇచ్చి స్టాఫ్‌కు పంచమనట్లు చెప్పారు. ధర్మేంద్ర నటించిన చివరి చిత్రంలో ఆయన చిన్ననాటి వెర్షన్ చూపించినప్పుడు దానికి బాబీ డియోల్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. తన తండ్రి లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండలేరని బాబీ డియోల్ కళ్లనీళ్లతో ముగించారు.

Tags:    

Similar News