రాబోయే సినిమాలు.. జోష్ తీసుకొస్తాయా?
తక్కువ ఫుట్ ఫాల్స్ తో థియేటర్లు వెలవెలబోయాయి. అయితే ఇప్పుడు ఏప్రిల్ విడుదలల జాబితా చూస్తే బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.;
సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొంతకాలంగా నెలకొన్న నిరాశకు ముగింపు పలికి ఏప్రిల్ నెల సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుందా?.. ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జనవరి చివరి వారం నుంచి మార్చి వరకు విడుదలైన చిన్నా, పెద్దా చిత్రాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు యాజమాన్యాలు తీవ్ర నిరాశ ఎదుర్కొన్నారు.
తక్కువ ఫుట్ ఫాల్స్ తో థియేటర్లు వెలవెలబోయాయి. అయితే ఇప్పుడు ఏప్రిల్ విడుదలల జాబితా చూస్తే బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటగా ఏప్రిల్ రేసును బైకర్ సినిమా ప్రారంభించనుంది. ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆ హై వోల్టేజ్ రేసింగ్ డ్రామాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అదే రోజు మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తున్న రాకాస కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
ఆ రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తే, ఏప్రిల్ మొదటి వారం నుంచి బాక్సాఫీస్ వద్ద సందడి మొదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటించిన డెకాయిట్ విడుదల కానుంది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ చిత్రంపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అదే రోజు తమిళ చిత్రం LIK తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏప్రిల్ మధ్యలో చిన్న, మీడియం రేంజ్ సినిమాల పోటీ ఎక్కువగా కనిపించనుంది. ఏప్రిల్ 17న నాగశౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్, కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న తిమ్మరాజు పల్లి టీవీ, అలాగే తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ సినిమాలు ఒకే రోజు విడుదలవుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనున్నాయి. ఏప్రిల్ 23న మలయాళ డబ్బింగ్ చిత్రం పేట్రియాట్ విడుదలకు సిద్ధమవుతోంది.
అయితే అసలైన బాక్సాఫీస్ పోరు మాత్రం నెలాఖరులో ఉండనుంది. అందరి దృష్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్దిపై ఉంది. ఆ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుండగా.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, పాటలు మంచి రెస్పాన్స్ అందుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఏదేమైనా గత రెండు నెలల నిరాశ తర్వాత ఏప్రిల్ టాలీవుడ్ కు మళ్లీ ఊపిరి పోసే నెలగా మారే అవకాశం ఉంది. వరుసగా విడుదలవుతున్న చిత్రాలు పాజిటివ్ టాక్ సాధిస్తే, థియేటర్లు మళ్లీ ప్రేక్షకులతో కళకళలాడే ఛాన్స్ ఉంది. మరి ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతున్న చిత్రాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వేచి చూడాలి.