10వ సీజ‌న్‌లోకి 'బిగ్ బాస్'.. ఇది ఆషామాషీ జ‌ర్నీకానే కాదు!

బిగ్ బాస్ ప్రజలకు ఇంతగా కనెక్ట్ అవ్వడానికి అందులోని కాన్‌ఫ్లిక్ట్ (సంఘర్షణ) - డ్రామా కీలకమైన క్వాలిటీస్.

Update: 2026-07-20 19:25 GMT

భారతీయ బుల్లితెర చరిత్రలో రియాలిటీ షోల అధ్యాయాన్ని తిరగరాసిన `బిగ్ బాస్` ఇప్పుడు తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన 10వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. తొలినాళ్లలో ఈ షోపై సాంప్రదాయవాదుల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. పాశ్చాత్య సంస్కృతిని, వికృతమైన భావనలను దిగుమతి చేస్తూ సమాజాన్ని చెడగొడుతున్నారంటూ పెదవి విరిచిన వాళ్లెందరో.. సినిమాలలోని వేగానికి అలవాటుపడిన ప్రేక్షకులు గంటల తరబడి సాగే ఈ ల్యాగ్ రియాలిటీ షోలను ఎలా ఆదరిస్తారనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ అన్ని ప్రతికూలతలను, సవాళ్లను అధిగమించి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 10వ సీజన్‌కు చేరుకోవడం అంటే ఇది ఆషామాషీ ప్రయాణం ఎంతమాత్రమూ కాదు.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలుగు బిగ్ బాస్ షో విజయంలో నాగార్జున పాత్ర అత్యంత కీలకమైనది. గత కొన్ని సీజన్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఆయన సృష్టించిన సంచలనాలు అసాధారణమైనవి. శని, ఆదివారాల్లో కంటెస్టెంట్లకు క్లాస్ పీకే క్రమంలోనైనా... వారి మధ్య ఉన్న చిక్కుముడులను విప్పే విషయంలోనైనా తనదైన శైలిలో షోను నడిపిస్తూ బోరింగ్ అనే పదానికి తావు లేకుండా చేస్తున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో ఈ వేడుక మరింత గ్రాండ్‌గా షురూ కానుంది. జియో స్టార్ నెట్‌వర్క్ ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బంగ్లా భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. నాగార్జునతో పాటు సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్ లాల్, సౌరభ్ గంగూలీ వంటి దిగ్గజాలు హోస్ట్‌లుగా వ్యవహరిస్తుండటంతో ఈసారి క్రేజ్ దేశవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్‌కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కొరియా సర్వైవల్ షోలు... అమెరికన్ గేమింగ్ ఫార్మాట్లు వంటి సరికొత్త రియాలిటీ షోలు వస్తున్నా కానీ.. భారతదేశంలో బిగ్ బాస్ సాధించిన మాస్ ఫాలోయింగ్‌ను ఏ ఇతర షో కూడా అందుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఈ షోకు ఉన్న మానసిక విశ్లేషణాత్మక స్వరూపమే. సమాజంలోని వేర్వేరు నేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను ఒకే పైకప్పు కింద వంద రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంచినప్పుడు...వారిలో వచ్చే ప్రవర్తనా మార్పులను వీక్షకులు తమ సొంత జీవితాలకు అన్వయించుకుంటారు. నటనకు తావులేని అసలైన మనుషుల ఎమోషన్స్, మానవ సంబంధాలలోని సంక్లిష్టతలు ప్రత్యక్షంగా కనిపించడమే దీని విజయ రహస్యం.

బిగ్ బాస్ ప్రజలకు ఇంతగా కనెక్ట్ అవ్వడానికి అందులోని కాన్‌ఫ్లిక్ట్ (సంఘర్షణ) - డ్రామా కీలకమైన క్వాలిటీస్. షోలో పెట్టే ప్రతీ టాస్క్ కూడా కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాక... పోటీదారుల ఓర్పును, వ్యూహాత్మక ఆలోచనను, నాయకత్వ లక్షణాలను పరీక్షించేలా ఉంటుంది. ఒత్తిడి పెరిగినప్పుడు మనుషులు ఎలా స్పందిస్తారు? స్నేహం- స్వార్థం మధ్య ఎలాంటి గీత గీస్తారు? అనే కోణాలు ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్సుకతను పెంచుతాయి. ప్రతి రోజూ ఎపిసోడ్ పూర్తయ్యాక ఏది తప్పు, ఏది ఒప్పు అని వీక్షకులే స్వయంగా తీర్పులు చెప్పుకునేలా ఈ షో వాతావరణాన్ని నిర్మిస్తుంది.

బిగ్ బాస్ కేవలం ఒక వినోద సాధనంగా మాత్రమే కాకుండా... ప్రేక్షకులకు ఒక `మిర్రర్ ఎఫెక్ట్`ను ఇస్తుంది. కంటెస్టెంట్ల కోపం, అసూయ, త్యాగం, గెలుపు తపనల ద్వారా ప్రేక్షకులు తమలోని భావోద్వేగాలను రీ-డిస్కవర్ చేసుకుంటారు. వోటింగ్ సిస్టమ్ ద్వారా ప్రేక్షకులకే సర్వాధికారాలు ఇవ్వడం వల్ల తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకోవాలనే ఒక ఓనర్‌షిప్ ఫీలింగ్ ఏర్పడుతుంది. సాంప్రదాయ విమర్శలను దాటుకుని.. భారతీయ సైకాలజీకి అనుగుణంగా రూపాంతరం చెందడం వల్లే ఈ రియాలిటీ షో అజేయమైన శక్తిగా అవతరించి 10వ సీజన్ మైలురాయిని దిగ్విజయంగా అందుకుంటోంది.

Tags:    

Similar News