బిగ్ బాస్ బూతు షో.. హౌస్‌ను ముట్టడిస్తాం అంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు
తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరుపొందిన బిగ్ బాస్, మరోసారి తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది.;
తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరుపొందిన బిగ్ బాస్, మరోసారి తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. షోలో ప్రసారమవుతున్న కంటెంట్ హద్దులు మీరుతోందని, అసభ్యతను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ కొందరు పౌరులు ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్, బాగన్నగారి రవీందర్ రెడ్డి మరికొందరితో కలిసి గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో స్టార్ మా, బిగ్ బాస్ నిర్వాహకులపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ పరిణామం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
కుటుంబంతో కలిసి చూడలేని విధంగా షోలో బూతులు, అశ్లీల ప్రవర్తన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదుదారులు తమ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, ఈ షో యువతపై తీవ్రమైన నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తోందని, వారిలో అగౌరవం, తప్పుడు ప్రవర్తనను నూరిపోస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ కుటుంబ విలువలకు, సాంస్కృతిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఉన్న ఈ షో, ఫ్యామిలీ వ్యూయింగ్ అవర్స్‌లో ప్రసారం కావడం ద్వారా సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తోందని వారు ఆరోపించారు.
షో కోసం కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్న తీరుపై కూడా ఫిర్యాదుదారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సమాజంలో ఎలాంటి విలువలు లేని వారిని, వివాదాస్పద నేపథ్యం ఉన్నవారిని కావాలనే ఎంచుకుంటున్నారని, వారి మధ్య గొడవలను సృష్టించి, దాన్నే వినోదంగా చూపిస్తున్నారని మండిపడ్డారు. క్రమశిక్షణ, సామాజిక విలువలు, ప్రజా చైతన్యం వంటి అంశాలను ప్రోత్సహించాల్సింది పోయి, గొడవలు, అగౌరవం, అసభ్యతను కంటెంట్‌గా మార్చారని వారు విమర్శించారు.
ఈ షో ప్రసారాలు ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని, కాబట్టి నిర్వాహకులు, ప్రమోటర్లు, బ్రాడ్‌కాస్టర్లపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. బిగ్ బాస్ షో ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.
ఒకవేళ తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోతే, తమ నిరసనను ఉధృతం చేస్తామని ఫిర్యాదుదారులు హెచ్చరించారు. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని వారు వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదంలోకి షో హోస్ట్ అక్కినేని నాగార్జునను కూడా లాగారు. ఆయన ఇలాంటి వివాదాస్పద షోలకు బదులుగా, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని హితవు పలికారు. మరి ఈ విషయంలో బిగ్ బస్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.