బ‌డ్జెట్ ముఖ్య‌మా? సినిమా కంటెంట్ ముఖ్య‌మా?

హాలీవుడ్ లో ప‌రిమిత బ‌డ్జెట్ల‌తో అద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కి ప్ర‌జ‌ల‌ను అల‌రించాయి.

Update: 2024-04-27 08:16 GMT

హాలీవుడ్ లో ప‌రిమిత బ‌డ్జెట్ల‌తో అద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కి ప్ర‌జ‌ల‌ను అల‌రించాయి. పారా నార్మ‌ల్ యాక్టివిటీ లాంటి చిన్న బ‌డ్జెట్ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వంద‌ల కోట్లు వ‌సూలు చేసిన వైనం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంత‌కుముందు ఆ త‌ర్వాత కూడా చాలా సినిమాల్ని ప‌రిమిత బ‌డ్జెట్ ప‌రిమిత క్యాస్ట్ అండ్ క్రూతో నిర్మించి హాలీవుడ్ అసాధార‌ణ వ‌సూళ్ల‌ను అందుకుంది.

అదే బాట‌లో బాలీవుడ్ లోను చాలామంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పెద్ద స‌క్సెస‌య్యారు. అనురాగ్ క‌శ్య‌ప్, సుజోయ్, విధు వినోద్ చోప్రా వంటి ద‌ర్శ‌కులు ప‌రిమిత బ‌డ్జెట్ల‌లో అద్భుత‌మైన కంటెంట్ ఉన్న సినిమాల్ని తెర‌కెక్కించారు. అసాధార‌ణ విజ‌యాల్ని అందుకున్నారు. అయితే ప‌రిమిత బ‌డ్జెట్లో సినిమాలు తీసిన వీరంతా ఆ త‌ర్వాత పెద్ద బడ్జెట్ సినిమాల‌కు మ‌ర‌లి అక్క‌డ కొన్ని సార్లు విజ‌యం సాధించి, మ‌రికొన్ని సార్లు ఫెయిల‌య్యి, పంపిణీ వ‌ర్గాల్లో తీవ్ర న‌ష్టాల‌కు కార‌కుల‌య్యారు.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోను చాలా మంది ద‌ర్శ‌కులు చిన్న బ‌డ్జెట్ సినిమాల‌తో అద్భుత‌మైన కంటెంట్ ని అందించిన వారున్నారు. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు కెరీర్ లో చిన్న బ‌డ్జెట్ సినిమాల‌ను తెర‌కెక్కించి గొప్ప విజ‌యాలను అందుకున్నారు. ఆయ‌న ప్ర‌తిభ‌కు కొల‌మానంగా ద‌ర్శ‌క‌ర‌త్న బిరుదునందుకున్నారు. దాస‌రి మారుతి ఈ రోజుల్లో లాంటి చిన్న బ‌డ్జెట్ సినిమాని తెర‌కెక్కించి పెద్ద విజ‌యం అందుకున్నాడు. ఆ త‌ర‌వాతా ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు. హ్యాపీడేస్- గోదావ‌రి లాంటి సినిమాల‌ను చిన్న బ‌డ్జెట్ల‌తో రూపొందించిన శేఖ‌ర్ క‌మ్ముల గొప్ప విజ‌యాలు అందుకున్నారు. నేటిత‌రం ద‌ర్శ‌కుల్లో ప‌లువురు చిన్న బ‌డ్జెట్ల‌తో పెద్ద విజ‌యాలు అందుకున్న‌వారున్నారు.

అయితే ఈ ద‌ర్శ‌కులంతా ఇప్పుడు కేవ‌లం పెద్ద బ‌డ్జెట్ సినిమాల‌ను మాత్ర‌మే తెర‌కెక్కించేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. నిజానికి సినిమాకి కావాల్సిన‌ది బ‌డ్జెట్ రేంజా లేక కంటెంటా? అన్న‌ది ఎప్పుడూ ప్ర‌శ్నార్థ‌క‌మే. పెద్ద బ‌డ్జెట్ పెద్ద కాన్వాసులో సినిమాల‌ను తెర‌కెక్కించేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా అనుప‌మ న‌టించిన ప‌ర‌ద అనే చిత్రాన్ని ప‌రిమిత బ‌డ్జెట్ లో రూపొందిస్తున్నార‌ని భావించినా ఈ సినిమా బ‌డ్జెట్ కాన్వాస్ ఆశ్చ‌ర్య‌పరిచాయి. సినిమా బండి లాంటి ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాన్ని అందించిన ప్ర‌వీణ్ కాండ్రేగుల ఈసారి పెద్ద బ‌డ్జెట్ తో సాహ‌సం చేస్తున్నారు. అయితే విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కులను న‌మ్మి నిర్మాత‌లు రాజీ లేకుండా పెట్టుబ‌డులు పెడుతున్నారు. దానికి త‌గ్గ‌ట్టే బిజినెస్ వ‌ర్గాల్లోను వారికి మంచి సానుకూల‌త ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. అలాగే చిన్న సినిమా కంటే పెద్ద సినిమాకు బిజినెస్ రిస్క్ ఉండ‌ద‌ని కూడా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తుంటారు. చిన్న సినిమాకి పెద్ద‌న్న స‌పోర్ట్ లేనిదే బిజినెస్ అవ్వ‌దు. అందువ‌ల్ల చాలా మంది చిన్న సినిమా జోలికే వెళ్ల‌రు. కానీ నేటిత‌రం ప్ర‌తిభావంతులు త‌మ ట్యాలెంట్ నే పెట్టుబ‌డిగా పెట్టి నిర్మాత‌ల‌కు అద్భుత‌మైన ఫ‌లాల్ని అందిస్తున్నార‌న‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News