'భోగి' మూవీ రివ్యూ
| శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వచ్చిన 'భోగి' ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. మూఢనమ్మకాలు, నరబలులు, హింస చుట్టూ తిరిగే కథలో బలమైన భావోద్వేగాలు కనిపించవు. ఫస్టాఫ్ నుంచే కథనం పడిపోగా, సెకండాఫ్, క్లైమాక్స్ మరింత నిరాశపరుస్తాయి. గంగ పాత్రలో శర్వానంద్ నటన ఆకట్టుకున్నా, మిగతా అంశాలు తేలిపోయాయి.
'భోగి' మూవీ రివ్యూ
నటీనటులు: శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్ - డింపుల్ హయతి - శరత్ లోహితశ్వ - లాల్ - రోహిత్ పాఠక్ - ప్రణవి మానుకొండ తదితరులు
ఛాయాగ్రహణం: కిషోర్ కుమార్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాత: కేకే రాధామోహన్
రచన-దర్శకత్వం: సంపత్ నంది
ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి చిత్రంతో తన ఫ్లాపుల పరంపరకు తెరదించాడు శర్వానంద్. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా భోగి లాంటి రస్టిక్ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడతను. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం.
కథ: 1962లో తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో బొగ్గులగుట్ట అనే ఊరిలో తల్లిదండ్రులు లేని గంగ (శర్వానంద్) కస్టపడి పని చేసుకుని బతుకుతూ తన ఐదుగురు చెల్లెళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. తన పెద్ద చెల్లెలి పెళ్లికి గంగ సిద్ధమైన సమయంలో ఆ ఊరిలో అందరూ భయపడే పటేల్ (శరత్ లోహితశ్వ) కు అతను ఎదురు వెళ్లాల్సి వస్తుంది. కానీ దానివల్ల గంగ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అతడికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇంతకీ పటేల్ కు గంగ ఎందుకు ఎదురు వెళ్ళాడు.. దానివల్ల అతడికి జరిగిన నష్టమేంటి.. దీనికి అతను ఎలా బదులు తీర్చుకున్నాడు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ: ఒక సినిమా ఫలితమేంటో కథ వినగానే చెప్పడం కష్టం. ప్రేక్షకులకు ఎలాంటి కథ నచ్చుతుంది.. ఏది నచ్చదో పర్ఫెక్టుగా ఎవ్వరూ చెప్పలేరు. కానీ చాలా కొన్ని కథలు మాత్రమే వినగానే బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే డిజాస్టర్ ఫీల్ కలిగించే కథలు కూడా కొన్ని ఉంటాయి. సంపత్ నంది 'భోగి' సినిమా ప్లాట్ పాయింట్ చెప్పగానే హీరో శర్వానంద్ సహా టీంలో ఎవ్వరికీ అలాంటి ఫీలింగ్ ఎందుకు కలగలేదా అన్నది డౌట్. ఈ రోజుల్లో ఇలాంటి కథ చెప్పి ప్రేక్షకులను మెప్పించవచ్చు అని నమ్మిన సంపత్ అండ్ టీం కాన్ఫిడెన్సుకి దండం పెట్టాలి అనిపిస్తుంది. ఇది 1962 నేపథ్యంలో నడిచే కథ. కానీ అన్నేళ్ల ముందు కూడా ఇలాంటి సినిమా తీస్తే జనాలు కనెక్ట్ అయ్యేవారా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంతటి తిరోగమన ఆలోచనలతో నడిచే కథ ఇది. మూఢ నమ్మకాలు.. నర బలులు.. తలలు నరకడాల చుట్టూ తిరిగే ఈ కథను తెరపై చూస్తే కలిగే అదో రకమైన ఫీలింగ్ నుంచి బయట పడడానికి చాలా సమయమే పడుతుంది.
మూఢ నమ్మకాలు.. చేతబడులు.. నరబలుల చుట్టూ కథలు రాయకూడదు. అలాంటి సినిమాలు తీస్తే తిరోగమనం అనేమి కాదు. అలాంటి కథలతో ప్రేక్షకులను భయపెట్టొచ్చు. థ్రిల్ చెయ్యొచ్చు. లేదా ప్రేక్షకులకు ఒక సందేశం కూడా ఇవ్వొచ్చు. కానీ భోగి ఇందులో ఏ కోవకూ చెందదు. ఈ కథలో ఒక ముఖ్య సన్నివేశం దగ్గర ప్రేక్షకులకు దిమ్మదిరిగే ఎమోషనల్ షాక్ ఇచ్చేశానని.. ఈ దెబ్బతో వాళ్ళు షేక్ అయిపోతారని దర్శకుడు భావించి ఉండొచ్చు. కానీ ఆ సీన్లో ప్రేక్షకుల్లో వచ్చేది ఎమోషన్ కాదు.. ఒక రకమైన ట్రామా. ఇంటర్వెల్ ముంగిట ఆ కొన్ని నిమిషాల స్ట్రోకే తట్టుకోలేనిది అంటే.. ఇంటర్వెల్ తర్వాత కూడా ఆ ఫీల్ పోకుండా కొనసాగించేలా ఒక పాట - ఇంకో ట్రమాటిక్ సీన్ పెట్టడం చూస్తే నోట మాట రాదు. సరైన ఎమోషన్ లేని వయోలెన్స్ ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తుందో ప్యారడైజ్ సహా ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. ఆ కోవలో చేరిన ఇంకో సినిమా.. భోగి. ఇటు హీరో వైపు వాళ్ళ ప్రాణాలు పోయినా రవ్వంత చలనం కలగదు.. అటు విలన్ వైపు తలలు తెగినా ఏ ఎమోషన్ రాదు అంటే అందుకు జీర్ణించుకోలేని భోగి ప్లాట్ పాయింటే కారణం.
ప్లాట్ పాయింట్ వేరు.. ట్రీట్మెంట్ డిఫరెంట్ కానీ.. భోగి కూడా దాదాపుగా రంగస్థలం లైన్లో నడిచే కథ. కానీ రంగస్థలం బలమైన ఎమోషన్ తో ప్రేక్షకులను కదిలిస్తే.. భోగి ఎమోషన్ లేని రక్తపాతంతో ఆడియన్సుకి వికారమే కలిగిస్తుంది. వందమందికి పైగా ఆడపిల్లల్ని చంపిన పటేల్ వచ్చి ఊరి జనం ముందు తాను చేసిన ఘోరం గురించి చెప్తే.. "ఇట్ట చేస్తే ఎట్టయ్యా" అని జనం సుతిమెత్తగా అడగడం.. మళ్ళీ పటేల్ చెప్పిన పిచ్చి కథకి కరిగిపోయి ఇంకో బలికి మేమంతా సహకరిస్తాం అని నినాదాలు చెయ్యడం.. ఇదంతా చూస్తే ఎంత 1962లో ఒక మారుమూల పల్లెటూరిలో జరిగే కథ అయినా సరే ఇంత మూర్ఖత్వమా అని తలలు పట్టుకోవాల్సిందే. ఫస్టాఫ్ అయ్యేసరికే భోగి పతనం ఖరారు అయిపోగా.. రెండో అర్థంలో గ్రాఫ్ ఇంకా ఇంకా పడుతూ వెళ్తుంది. క్లైమాక్సులో వచ్చే ట్విస్టుతో సరాసరి పాతాళానికి పడిపోతుంది సినిమా. ఆ వర్గం.. ఈ వర్గం అని తేడా లేదు.. ఎలాంటి వాళ్ళైనా ఈ కథతో కనెక్ట్ అయి చివరి వరకు కూర్చోవడం కష్టమే.
నటీనటులు: సినిమా సంగతి ఎలా ఉన్నా శర్వానంద్ మాత్రం గంగ పాత్రలో సిన్సియర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అన్నీ అతిగా అనిపించే ఈ చిత్రంలో కరెక్ట్ మీటర్లో ఉండేది శర్వా నటన మాత్రమే. తొలిసారి ఇంత ఊర మాస్ పాత్ర చేసిన శర్వా దానికి న్యాయం చేశాడు. కానీ అతనీ కథను ఎలా ఓకే చేశాడు అన్నదే సందేహం. సులోచన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ బాగానే చేసింది. మేకప్ లేని పాత్రలో అనుపమ సహజంగా కనిపించింది. డింపుల్ హయతి పాత్ర.. తన అప్పియరెన్స్ మాత్రం అదోలా అనిపిస్తాయి. ఎంత వేశ్య తరహా పాత్ర అయినా సరే సమయం సందర్భం లేకుండా ప్రతి సీన్లో ఆ అలంకరణ ఏంటో.. ఆ క్లీవేజ్-నావల్ షోలు ఏంటో అర్థం కాదు. విలన్ పాత్రలో శరత్ లోహితశ్వ అంతగా మెప్పించలేకపోయాడు. క్రౌర్యాన్ని చూపించలేకపోయాడు. లాల్ లాంటి నటుడిని ఏమాత్రం ఉపయోగించుకోలేదు. వేస్ట్ చేసేశారు. రోహిత్ పాఠక్ నెగెటివ్ పాత్రలో బాగానే చేశాడు. హీరో చెల్లెళ్ళ పాత్రలు చేసిన అమ్మాయిలందరూ ఓకే.
సాంకేతిక వర్గం: భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా శైలికి తగ్గట్లే రస్టిక్ ఫీల్ ఇచ్చే మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు.. బీజీఎం ఒక శైలిలో సాగాయి. పాటలు బావున్నా.. చంద్రబోస్ మంచి సాహిత్యం అందించినా.. సందర్భాలు కుదరక వేస్ట్ అయిపోయాయి. సన్నివేశాలు పండి ఉంటే బీజీఎం ఫీల్ వేరుగా ఉండేదేమో కానీ.. చాలా చోట్ల స్కోర్ లౌడ్ గా.. కొన్ని చోట్ల కర్ణకఠోరంగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు లోటు లేదు. బాగానే ఖర్చు పెట్టి సినిమా తీశారు. కానీ అదంతా వృథానే. సంపత్ నంది రచన గురించి.. దర్శకత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు. తన కథను జీర్ణించుకోవడం ప్రేక్షకులకు చాలా కష్టం. ఆ కథను ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా పేలవం. రాసేటపుడు.. తీసేటప్పుడు ఇది అసలు వర్కవుట్ అవుతుందా అనే సందేహమే సంపత్ నందికి.. తన టీంలో ఎవ్వరికీ సందేహం రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
చివరగా: 'భోగి'..ఎలాంటి సంతృప్తి ఇవ్వని రక్తపాతం!
రేటింగ్ - 1.5/5