సుకుమార్ వంటి దర్శకుడు ఇలా చేస్తే ఎలా?
| దర్శకుడు సుకుమార్ 22 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 9 సినిమాలు మాత్రమే తెరకెక్కించారు. ‘పుష్ప 2’ విడుదలై రెండేళ్లు అవుతున్నా తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్ చరణ్‌తో చేయనున్న సినిమా వచ్చే ఏడాది మొదలై 2028 చివర్లో విడుదలయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ సినిమాల మధ్య భారీ గ్యాప్‌పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ టాప్ స్టార్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 22 ఏళ్లు అవుతున్నా ఆయన నుంచి వచ్చిన సినిమాలు కేవలం 9 మాత్రమే. అందులో పుష్ప సింగిల్ పార్ట్ అనుకున్నప్పటికీ కథ పెద్దది కావడంతో రెండు పార్ట్‌లుగా విడుదల చేయాల్సి వచ్చింది. అంటే టెక్నికల్‌గా సుకుమార్ ఇప్పటి వరకు ప్రేక్షకులకు చెప్పింది కేవలం 8 కథలు మాత్రమే. దాదాపు రెండు పుష్కరాల కాలంలో సుకుమార్ వంటి దర్శకుడు ఇలా తక్కువ సినిమాలు చేయడం ను ప్రేక్షకులు, అభిమానులు తప్పుబడుతున్నారు. మంచి వాడి మౌనం సమాజానికి మంచిది కాదు అంటారు, అలాగే ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఖాళీగా ఉండటం కూడా సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది సినీ ప్రేమికుల అభిప్రాయం. ఆయన ఏడాదికి ఒకటి కాకున్నా కనీసం రెండేళ్లకు ఒకటి అయినా చేసి ఉంటే బాగుండేది అనేది చాలా మంది అభిప్రాయం.
సుకుమార్ పుష్ప 2 సినిమా తర్వాత...
పుష్ప 2 సినిమా విడుదల అయ్యి రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు తదుపరి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్ చరణ్‌తో సుకుమార్ సినిమా కన్ఫర్మ్ అయింది, కానీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది మాత్రం ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. సుకుమార్ స్క్రిప్ట్‌కు చాలా సమయం తీసుకుంటాడు అనే టాక్ ఉంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత కాస్టింగ్ కోసం కూడా చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు. టాలీవుడ్‌లో కాస్టింగ్‌కి ఎక్కువ సమయం తీసుకునే దర్శకుడిగా సుకుమార్‌కి పేరు ఉంది. పుష్ప, రంగస్థలం సినిమాలకు నెలలకు నెలలు కాస్టింగ్ ఎంపిక చేసినట్లు యూనిట్ సభ్యులు చెబుతూ ఉంటారు. ఆయన శిష్యులు కాస్టింగ్ విషయంలో సుకుమార్ చాలా సమయం తీసుకుంటాడని, అందుకే ఆయన సినిమాలోని ప్రతి పాత్రకు పర్‌ఫెక్ట్ నటుడు ఎంపిక అయినట్లు అనిపిస్తుందని అంటూ ఉంటారు.
రామ్ చరణ్, సుకుమార్ కాంబో...
సుకుమార్ పుష్ప 2 వచ్చి రెండేళ్లు అయినా చరణ్ మూవీని మొదలు పెట్టలేదు. వచ్చే ఏడాదిలో చరణ్-సుక్కూ మూవీ పట్టాలు ఎక్కడం కన్ఫర్మ్. అయితే ఆ సినిమా విడుదల అయ్యేది మాత్రం 2028 చివర్లో అనే వార్తలు వస్తున్నాయి. అంటే పుష్ప 2 విడుదల అయిన నాలుగు ఏళ్ల తర్వాత సుకుమార్ తదుపరి సినిమా థియేటర్‌లకు రాబోతుంది. ఒక స్టార్ డైరెక్టర్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఒక్క సినిమాకు మరీ ఇంత గ్యాప్ ఇవ్వడం అనేది ఇండస్ట్రీకి మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ వంటి దర్శకుడు ఇలా చేస్తే ఇండస్ట్రీ మనుగడ ఎలా అంటూ చాలా మంది సినీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇకపై అయినా సుకుమార్ నుంచి ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అది సాధ్యం అయ్యే పని కాదని ఆయన సన్నిహితులు సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, హీరోలు...
టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు ఏడాదికి కనీసం ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్నారు. కొందరు బడా డైరెక్టర్స్ కొందరు రెండేళ్లకు ఒకటి చొప్పున సినిమాలు చేస్తున్నారు. కానీ సుకుమార్ మాదిరిగా మూడు నాలుగు ఏళ్లు ఒక్క సినిమాకు టైం తీసుకోవడం లేదు. హీరోలు సినిమాలను స్పీడ్‌గా చేయాలని చెప్పడం కాదు, దర్శకులు ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. హీరోలు ఏడాదిలో రెండు సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ దర్శకులు పడనివ్వడం లేదు. స్టార్ హీరోతో సినిమా అనగానే దర్శకులు స్క్రిప్ట్ కి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, స్టార్ కాస్ట్ కి సమయం తీసుకుంటున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ఎక్కువ సమయం తీసుకుంటున్న కారణంగా హీరోల సినిమాలు ఆలస్యం అవుతున్నాయి, అదే విధంగా దర్శకులు రెండు మూడు ఏళ్లకు కూడా ఒక సినిమాను విడుదల చేయలేక పోతున్నారు. ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు వస్తేనే కింది స్థాయి నుంచి అన్ని స్థాయిల వారికి మంచిది.