తెలుగు సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి.. పొగడ్త కాదు బరువు!
| ‘అలియాస్ రుక్మిణి’ దర్శకుడు మురళీకాంత్‌ను హీరో నితిన్ మరో రాజ్‌కుమార్ హిరాణిగా అభివర్ణించారు. కేవలం 45 రోజుల్లోనే మంచి క్వాలిటీతో సినిమా పూర్తి చేశారని ప్రశంసించారు. కమర్షియల్ లెక్కలు కాకుండా కథ నచ్చి ఈ సినిమా చేశానని, ఇందులోని కృష్ణ పాత్ర అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఒక దర్శకుడిని ఏ నమ్మకంతో ఒక లెజెండరీ దర్శకుడితో పోల్చారు? అంతగా అతడిలో ఏం నచ్చిందో తెలీదు కానీ.. హీరో నితిన్ తన `అలియాస్ రుక్మిణి` దర్శకుడు మురళిని ఆకాశానికెత్తేసారు. అతడు తెలుగు సినిమాకు మరో రాజ్ కుమర్ హిరాణి! అంటూ కితాబిచ్చేసారు. కేవలం 45 రోజులలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేసారని, అలాగని ఎక్కడా చుట్టేయలేదని.. మంచి క్వాలిటీతో సినిమాని తెరకెక్కించారని కూడా చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నేచురల్ స్టార్ నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `అలియాస్ రుక్మిణి` థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ వేదికగా హీరో నితిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. `దండోరా` ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేసినా ఎక్కడా చుట్టేయకుండా మంచి క్వాలిటీతో తెరకెక్కించారని నితిన్ కొనియాడారు. అంతటితో ఆగకుండా తన దర్శకుడు మురళిని ఏకంగా తెలుగు సినిమాకు దొరికిన మరో రాజ్‌కుమార్ హిరాణిగా అభివర్ణిస్తూ ఆకాశానికెత్తేశారు. ఒకే సన్నివేశంలో ప్రేక్షకులను నవ్విస్తూ, ఏడిపిస్తూ ఆలోచింపజేసే సత్తా మురళిలో ఉందని..ఇందులోని కృష్ణ పాత్రను అందరూ తప్పకుండా ఇష్టపడతారని బలంగా నమ్ముతున్నట్లు నితిన్ తన స్ట్రాంగ్ ఫీలింగ్‌ను బయటపెట్టారు.
ఈ సినిమా ఎంపిక వెనుక ఉన్న తన ఆలోచనను కూడా నితిన్ రివీల్ చేసారు. తన కెరీర్‌లో మొదటిసారి ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా... కేవలం కథ నచ్చి మనస్ఫూర్తిగా ఈ సినిమా చేశానని తెలిపారు. ఇందులో పాటలు ఉన్నాయా.. ఫైట్లు ఉన్నాయా.. డ్యాన్సులు ఉన్నాయా అనే విషయాలేవీ తాను ఆలోచించలేదని స్పష్టం చేశారు. కేవలం కంటెంట్‌ను మాత్రమే నమ్మి ఒక మంచి కథతో సినిమా చేద్దామని దర్శకుడికి ముందే క్లియర్‌గా చెప్పి ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టానని.. సినిమా చూశాక ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతుందని నితిన్ ధీమా వ్యక్తం చేశారు.
అయితే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణితో ఒక యువ దర్శకుడిని పోల్చడం అంటే అది మాటల విషయం కాదు.. అదో పెద్ద బరువైన బాధ్యత అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పీకే, సంజు, 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, డంకీ వంటి క్లాసిక్ చిత్రాలతో జెంటిల్‌మన్ ఇమేజ్ దాటి గ్రేట్ క్రియేటర్‌గా నిలిచిన హిరాణి లాజిక్ మిస్ కాకుండా కథలను మలచడంలో తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఇప్పుడు నితిన్ తన దర్శకుడికి అంతటి భారీ కితాబు ఇవ్వడంతో అభిమానులు, నెటిజన్లలో ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి.
మరోవైపు గ్లింప్స్, పోస్టర్లు, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన `అలియాస్ రుక్మిణి` తాజా ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షించింది. కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా కథనే ప్రధాన బలంగా నమ్మి నాని నిర్మాణ భాగస్వామ్యంతో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.
ప్రచార వేదికపై నితిన్ చెప్పినంత స్థాయిలో సినిమా కంటెంట్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే దర్శకుడు మురళీకాంత్‌కు నిజంగానే మంచి పేరొస్తుంది. ఒకవేళ అంచనాలను అందుకోవడంలో ఏమాత్రం తడబడితే మాత్రం ఈ ఆకాశాన్ని తాకే పొగడ్తలనే నెటిజన్లు ట్రోల్స్‌గా మార్చే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు.