'కింగ్'ను సైలెంట్‌గా ఉండమన్న అంబానీ? లీగల్ నోటీస్ కలకలం!
| ఇన్ఫ్లుయెన్సర్ సువిజ్ఞ శర్మకు షారుఖ్ ఖాన్ లీగల్ నోటీసు పంపారంటూ వైరల్ అయిన స్క్రీన్‌షాట్‌పై ఆయన టీమ్ స్పందించింది. ఆ నోటీసును షారుఖ్ జారీ చేయలేదని, ఆయన తరఫున ఎవరూ పంపలేదని హిరానీ అసోసియేట్స్ స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని తొలగించాలని మీడియా సంస్థలను కోరింది.
ఒక పెద్ద సూపర్‌స్టార్ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు లీగల్ నోటీస్ పంపారంటూ సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తున్న ఒక నోట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పేరుతో సోషల్ మీడియాలో షికార్ చేస్తున్న ఒక నకిలీ లీగల్ నోటీసు వ్యవహారం రచ్చగా మారింది. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళుతుండటంతో మీడియాలో డిబేట్ గా మారింది. అయితే దీనిపై ఖాన్ టీమ్ నేరుగా స్పందించడంతో ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సువిజ్ఞ శర్మకు షారుఖ్ తరఫున లీగల్ నోటీసు పంపినట్లు ఇటీవల ఆన్లైన్లో ఒక స్క్రీన్‌షాట్ వైరల్ కావడంతో తీవ్ర చర్చ మొదలైంది.
దీనిపై షారుఖ్ ఖాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న `హిరానీ అసోసియేట్స్` లా ఫర్మ్ తమ అధికారిక ఇన్‌స్టా ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సదరు నోటీసును షారుఖ్ ఖాన్ జారీ చేయలేదని.. ఆయన తరపున కూడా ఎవరూ పంపలేదని తేల్చి చెప్పింది. ఆ నోట్‌ని సోషల్ మీడియాల నుంచి తొలగించాల్సిందిగా న్యాయవాదుల ఫర్మ్ కోరింది.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023లోని సెక్షన్ 356ను ప్రస్తావిస్తూ వైరల్ అయిన ఆ నకిలీ నోటీసులో.. ఇన్ఫ్లుయెన్సర్ సువిజ్ఞ శర్మ తాను పోస్ట్ చేసిన రీల్‌ను 48 గంటల్లోగా తొలగించాలని.. లేదంటే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ నోటీసుపై స్పందించిన శర్మ తన వ్యాఖ్యలు భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోకి వస్తాయని సమర్థించుకుంటూ మరో వీడియో విడుదల చేశారు. అనంత్ అంబానీ ఆధ్యాత్మిక గురువు సద్గురుతో మాట్లాడుతున్న దృశ్యాలతో పాటు షారుఖ్ ఖాన్ - అంబానీ మధ్య జరిగిన సంభాషణ క్లిప్‌ను జతచేసి.. అక్కడ షారుఖ్‌ను నిశ్శబ్దంగా ఉండమని చెప్పారంటూ ఆ రీల్లో ఆరోపించడంతో ఈ వివాదం రాజుకుంది.
ఈ నేపథ్యంలో స్పందించిన హిరానీ అసోసియేట్స్.. షారుఖ్ ఖాన్ తమకు గానీ.. మరే ఇతర న్యాయవాదులకు గానీ అలాంటి నోటీసు పంపమని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. నిజానిజాలు నిర్ధారించుకోకుండా షారుఖ్ ఖాన్ పేరుతో ఈ తప్పుడు నోటీసు వార్తలను ప్రచురించవద్దని ఇప్పటికే షేర్ చేసిన కథనాలను సరిదిద్దాలని లేదా తొలగించాలని మీడియా సంస్థలు- సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేసింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. `డంకీ` తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం `కింగ్` డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. `పఠాన్` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ - షారుఖ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.