'నాన్న కుట్టి' మూవీ రివ్యూ
| విజయ్ ఆంటోనీ నటించిన ‘నాన్న కుట్టి’ తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, నెమ్మదిగా సాగే ఫస్టాఫ్, మెలోడ్రామా, ఓవర్ సెంటిమెంట్ ఇబ్బంది పెడతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్, ఆసక్తికరమైన సెకండాఫ్, చైల్డ్ ఆర్టిస్ట్ నటన ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ భావోద్వేగానికి గురిచేస్తుంది.
'నాన్న కుట్టి' మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్ ఆంటోని- ప్రీతీ అస్రాని- భగవతి పెరుమాళ్ - హరిప్రియ ఇసై - అరువి మదన్ - బేబీ లితన్య తదితరులు
ఛాయాగ్రహణం: రాజీవ్ రాజేంద్రన్
సంగీతం: విజయ్ ఆంటోనీ
నిర్మాతలు: విజయ్ ఆంటోనీ-మీరా విజయ్ ఆంటోనీ- రామంజనేయులు జవ్వాజి
రచన -దర్శకత్వం: ము. మారన్
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో పెద్ద హిట్ కొట్టినప్పట్నుంచి.. రెగ్యులర్ గా తన తమిళ సినిమాలను డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. తన నుంచి వచ్చిన కొత్త సినిమా.. నాన్న కుట్టి. తండ్రి-కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ: సూర్య (విజయ్ ఆంటోనీ) తన నెలల కూతురు దియా (బేబీ లితన్య) తీసుకుని వైజాగ్ నుంచి పారిపోయి ఊటీకి వచ్చి బతుకుతూ ఉంటాడు. కూతురు పెద్దవుతుంటే తన తల్లి రేవతి చనిపోయింది అని చెప్పి పెంచుతాడు. సూర్యకి కూతురు దియా అంటే ప్రాణం. తన కోసం ఏమైనా చేస్తాడు. దియా స్కూలలలో తనతో క్లోజ్ గా ఉండే టీచర్ అనిత (ప్రీతి అస్రాని) సూర్యని ఇష్టపడి ప్రపోజ్ చేస్తే అతను నో చెప్తాడు. ఇంతలో సూర్య చనిపోయిందని చెప్పిన రేవతి ఒక రోజు ఊటీలో అనితకి కనిపించడంతో ఆమె సూర్యని నిలదీస్తుంది. దీంతో కూతురిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటాడు సూర్య. అంతలో అతడికి పెద్ద షాక్ తగులుతుంది. అదేంటి? ఇంతకీ రేవతి దియా తల్లేనా? ఆమె చనిపోయిందని సూర్య ఎందుకు చెప్పాడు? ఈ మిస్టరీ ఏంటి? సూర్యకు ఎదురైన రకరకాల సమస్యల నుంచి అతను బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: కొన్నేళ్ల ముందే విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమెకు నివాళి అన్నట్లు తండ్రి కూతురు ఎమోషన్ నేపథ్యంలో 'నాన్న కుట్టి' సినిమా తీసి.. నిర్మాతల్లో తన కూతురి పేరు కూడా పెట్టాడు విజయ్. దీనికి తోడు ట్రైలర్ ను బట్టి కూడా చూస్తే ఇది సెంటిమెంట్.. ఎమోషన్ పీక్స్ లో ఉండే సినిమా అని అర్థమైపోయింది. ఐతే ఎమోషన్ కొంత మేర వర్కవుట్ అయినప్పటికీ... ఎంత ప్రిపేర్ అయి వెళ్ళినా సరే ఇందులో సెంటిమెంట్ - మెలోడ్రామా శ్రుతి మించినట్లే అనిపిస్తాయి. ఈ రోజుల్లో అంత సెంటిమెంటును తట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. విషయం ఉన్న కథే అయినా ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడంతో అనుకున్నంత ఇంపాక్ట్ వెయ్యలేకపోయింది. కథలో కొన్ని మలుపులు.. కొంతమేర ఎంగేజ్ చేసే ద్వితీయార్థం వల్ల కాస్త పర్వాలేదు అనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా మిశ్రమ అనుభూతే కలుగుతుంది.
నాన్న కుట్టిలో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. కానీ ఆ స్టోరీ టేకాఫ్ అవ్వడానికే చాలా టైమ్ పడుతుంది. కథలో మలుపు వచ్చేవరకు పెద్దగా కదలిక ఉండదు. హీరో ఓ ఫైట్ చేసి కూతురుతో ఊటీ పారిపోయి అక్కడ బతకడంతో మొదలయిన కథ.. కూతురు - తండ్రి ఎమోషన్ ను ఎస్టాబ్లిష్ చేయడంలో చాలాసేపు ఒకే చోట ఉండిపోతుంది. కూతురు.. స్కూల్.. నాన్న.. మధ్య మధ్యలో టీచర్.. ఈ క్యారెక్టర్లు సీన్లతోనే దాదాపు 40 నిమిషాల వరకు కథ అక్కడక్కడే తిరుగుతుంది. మధ్యలో ఒకటి రెండు కామెడీ సీన్స్ తో నవ్వించడానికి ట్రై చేశారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఐతే చనిపోయిందనుకున్న పాత్ర కనిపించడంతో కథపై ఆసక్తి నెలకొంటుంది. కూతురుకి అనారోగ్యం అనగానే తనను కాపాడుకోవడానికి తండ్రి ఏం చేశాడు అనే రొటీన్ ఎమోషన్ మీద సినిమా నడుస్తుందని ఫిక్స్ అయిపోతాము. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ఇవ్వడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పేలింది. సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.
ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ పర్వాలేదు. కథ ప్రేక్షకులను కొంచెం ఎంగేజ్ చేస్తుంది. కానీ దర్శకుడు చెప్పాలనుకున్న పాయింటుని సరిగా చెప్పలేకపోయాడు. కథ మరీ కంగాళీ అయిపోయింది. అక్కడక్కడా మెలోడ్రామా ఎక్కువైపోవడం ఇబ్బందిగానే అనిపిస్తుంది. సూర్య - రేవతి ఫ్లాష్ బ్యాక్ సింపుల్ గానే ఉన్నా.. చిన్న పాప సీన్స్ కాస్త ఓవర్ డ్రమటిగ్గా అనిపిస్తాయి. కూతురుకి వచ్చిన సమస్య.. హీరో తనను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన సీన్లు పర్వలేదనిపిస్తాయి. చివర్లో కోర్ట్ రూమ్ డ్రామా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. క్లైమాక్స్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ సీన్ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతకుముందంతా ఎమోషనల్ సీన్లు కొంచెం ఓవర్ అనిపించిన క్లైమాక్స్ మాత్రం కదిలిస్తుంది. చివర్లో మంచి ఫీలింగ్ కలిగినా.. బోరింగ్ ఫస్టాఫ్.. కొన్ని సాగతీత సీన్లు.. ఓవర్ సెంటిమెంట్ మాత్రం సినిమాకు మైనసే.
నటీనటులు: విజయ్ ఆంటోనీ ఎప్పట్లాగే తనకి నప్పే సీరియస్ పాత్రలో బాగానే నటించాడు. ప్రేక్షకులను కొన్ని చోట్ల అతను ఎమోషనల్ గా కదిలించాడు. ఎక్కువగా భావాలు పలికించలేని తన బలహీనతను గుర్తించి.. తనకున్న పరిమితుల్లో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం మంచి విషయం. ప్రీతీ అస్రాని అందంగా కనిపిస్తూ.. సింపుల్ గా నటిస్తూ ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ లితన్య సినిమాకు హైలైట్. తన క్యూట్.. ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. హరి ప్రియా ఇసై చక్కగా నటించింది. అరువి మదన్ కోపిష్టి పాత్రలో బాగానే చేశాడు. భగవతి పెరుమాళ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న సైకో భర్తగా మెప్పించాడు. జెన్సన్ దివాకర్ అక్కడక్కడా నవ్వించాడు. రేవతి పాత్రలో నటించిన నటి.. మిగిలిన ఆర్టిస్టులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా నాన్న కుట్టి ఓకే. రాజీవ్ రాజేంద్రన్ మంచి సినిమాటోగ్రఫీ అందించాడు. విజువల్స్ బాగున్నాయి. ఊటీ లొకేషన్స్ బాగా చూపించారు. విజయ్ ఆంటోనీ సంగీతంలో కొత్తదనం లేదు. పాటలు విజయ్ స్టైల్లో సాగుతూ ఎక్కడో విన్నట్లే అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బాగానే ఖర్చు పెట్టారు. దర్శకుడు ము. మారన్ తండ్రి - కూతురు ఎమోషన్ నేపథంలో కొత్త పాయింట్ రాసుకున్నప్పటికీ దాన్ని సరిగా ప్రెజెంట్ చెయ్యలేకపోయాడు. మంచి కథే అయినా.. చాలా విషయాలు, పాత్రలను అందులో కలవడంతో గందరగోళంగా తయారైంది.
చివరగా: నాన్న కుట్టి.. మంచి కథే కానీ
రేటింగ్- 2.25/5